జోషిమఠ్ లో ఇళ్లు కూల్చివేత.. సుప్రీం కోర్టులో పిటిషన్
జోషిమఠ్ విషయంలో అత్యవసర విచారణ చేపట్టాలని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసర విచారణకోసం దాఖలైన ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ప్రకృతి ప్రకోపానికి కుంచించుకు పోతున్న జోషిమఠ్ లో ఇళ్ల కూల్చివేత మొదలైంది. బీటలువారిన ఇళ్లను అధికారులే కూల్చేస్తున్నారు. వాటి వల్ల ఎవరికీ ముప్పు వాటిళ్లకుంటా శిథిలాలను తొలగిస్తున్నారు. ఇళ్లు కోల్పోయినవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, వారికి నెలకి 4వేల రూపాయల చొప్పున ఆరు నెలలపాటు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు అధికారులు.
ఉత్తరాఖండ్ లోని జోషి మఠ్‌లో సుమారు 17 వేల జనాభా ఉంది. సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పట్టణం, బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్‌లకు వెళ్లే యాత్రికులకు ప్రధాన ఆవాసం. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కూడా జోషిమఠ్ పేరుగాంచింది. అయితే ఇటీవల ఇక్కడ అభివృద్ధి పనుల పేరుతో నిర్మాణాలు ఎక్కువయ్యాయి. హైవేలు, బ్రిడ్జ్ ల నిర్మాణం మొదలైంది. మరోవైపు ప్రైవేటు నిర్మాణాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే ఇటీవల జోషిమఠ్ లో నేల కుంచించుకుపోతోంది, బీటలువారుతోంది, ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. అభివృద్ధి పనుల పేరుతో జరుగుతున్న నిర్మాణాల వల్లే ఇదంతా జరుగుతోందని, రోడ్లకోసం కొండల్ని తొలచడం, బాంబులతో పేల్చడం వల్ల తమ ఆవాసాలకు ముప్పు ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు జోషిమఠ్ వాసులు. ఆరోపణలు, ప్రత్యారోపణలు, కారణాలు ఎలా ఉన్నా.. అంతిమంగా జోషిమఠ్ నివాసానికి పనికిరాని పట్టణంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు జీవిస్తున్నారు. వారందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఇళ్లను కూల్చి వేస్తున్నారు అధికారులు.
సుప్రీంకోర్టులో పిటిషన్..
జోషిమఠ్ విషయంలో అత్యవసర విచారణ చేపట్టాలని స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోషిమఠ్ వాసులకు త్వరగా ఆర్థిక సాయం చేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. అత్యవసర విచారణకోసం దాఖలైన ఈ పిటిషన్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసుపై జనవరి 16న విచారణ జరుపుతామని తెలిపింది. ముఖ్యమైన ప్రతి అంశంపై సుప్రీంకు రావాల్సిన అవసరం లేదని, ఆ అంశాలపై ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థలు నిర్ణయం తీసుకుంటాయని కోర్టు తెలిపింది.