Telugu Global
National

ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు.. వారికి మాత్రమే..!

తెలంగాణలో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయమై ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రానికి సమాచారం పంపింది.

ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు.. వారికి మాత్రమే..!
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ సదుపాయం కోరుకున్నవారికి ముందస్తుగా పోస్టల్‌బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్ కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సమాచారం పంపింది.

తెలంగాణలో ఈ ఏడాది చివరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరు అర్హులన్న విషయమై ఎన్నికల సంఘం తాజాగా రాష్ట్రానికి సమాచారం పంపింది. 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు, కేంద్ర బలగాల్లో పనిచేస్తున్నవారు, ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది, పోలింగ్‌ ఏజెంట్లు, ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులు ఇలా 11 రకాల వారికి పోస్టల్‌బ్యాలెట్‌ పత్రాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. అయితే 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటినుంచే ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారైన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్లను అధికారులు రెడీ చేస్తారు. ఇంటి నుంచి ఓటు వేసే వారికి ప్రత్యేక రంగుల్లో స్పెషల్ బ్యాలెట్‌ పేపర్‌ను రూపొందించనున్నారు.

ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసేందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు పంపనుంది. అయితే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకున్న వారు ఆ ప్రాంత ఎన్నికల అధికారికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు..ఆయా ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. నాగార్జునసాగర్‌, మునుగోడు బైపోల్స్‌తో పాటు .. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ విధానాన్ని అమలు చేశారు. ఇది సక్సెస్ కావడంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 80 ఏళ్లు దాటిన ఓటర్లు రాష్ట్రంలో 4 లక్షల 87 వేల 950 మంది ఉన్నారు. వచ్చే నెలలో విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో ఇలాంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారనేదానిపై మరింత క్లారిటీ వస్తుంది.

*

First Published:  21 Sept 2023 8:19 AM IST
Next Story