దేశవ్యాప్తంగా అట్టహాసంగా హోలీ వేడుకలు
ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొడుతున్న జనం

దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి, అయోధ్య, సంబల్ సహా పలుచోట్ల వేలాదిమంది ఒక్కచోటికి చేరి రంగుల పండుగను చేసుకున్నారు. పలు పాటలకు డ్యాన్స్ చేశారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. గోరఖ్‌పూర్‌లో నిర్వహించిన హోలీ వేడుకల్లో సీఎం ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. బీహార్‌లోని పాట్నాలో డోలు వాయిస్తూ ఆహ్లాదంగా హోలీ చేసుకున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ దళాలు రంగుల పండుగను చేసుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ కేరింతలు కొడుతున్నారు. కోడిగుడ్లు, టమాటలు కొట్టుకుంటూ ఉల్లాసంగా గడుపుతున్నారు. గన్నులతో ఒకరిపై ఒకరు రంగులు చిమ్ముకుంటున్నారు. చిన్నా, పెద్ద మహిళలు, యువతీ, యువకులు అందరూ డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
రంగులు చల్లుకుంటూ..డీజే సాంగ్స్‌కు స్టెప్పులు
హోలీ పండుగను పురస్కరించుకుని రాష్ట్రమంతతా వర్ణరంజితం అవుతున్నది. ప్రజలంతా రంగులు పూసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. పొద్దుగాల్నే కామదహనం నిర్వహించిన అనంతరం కోడిగుడ్లు, టమాటాలు కొట్టుకుంటూ ఆహ్లాదాన్ని పంచుకుంటున్నారు. యువత బురదలోనూ, నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ డీజే సాంగ్స్‌కు స్టెప్పులేశారు. బేగంబజార్, రాజస్థాన్ సమాజ్‌కు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో చేరుకుని హోలిపండుగను అట్టహాసంగా నిర్వహించారు. జిల్లాల్లోనూ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.
పోలీసుల ఆంక్షలు
హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ అయ్యాయి. రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులపై రంగులు చల్లొద్దని హెచ్చించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్నారు.