Telugu Global
National

మహాత్మా మమ్మల్ని క్షమించకు!

హిందూ రాష్ట్రం కావాలి....హిందువులు కత్తులు ధరించండి....ముస్లింల వ్యాపారాలను బహిష్కరించండి...ఈ నినాదాలతో పది వేల మంది ఓ ఊరేగింపు తీశారు. అందులో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గాంధీ జయంతి రోజున కర్నాటకలో జరిగిన ఈ ర్యాలీ ఆందోళన కలిగిస్తోంది.

మహాత్మా మమ్మల్ని క్షమించకు!
X

ఆదివారం ఉదయం, కర్ణాటకలోని ఉడిపిలో రద్దీగా ఉండే సిటీ బస్టాండ్ ప్రాంతం గుండా 10,000 మందికి పైగా జనం...అందులో కొందరు కత్తులు దూసి... ఓ ర్యాలీ జరిగింది. హిందూ జాగరణ వేదిక చేపట్టిన ఈ ర్యాలీ కడియాలిలోని మహిషమర్దిని ఆలయం నుంచి ప్రారంభమై ఉడిపి సిటీ బస్టాండ్‌కు చేరుకుని ఉడిపి కృష్ణ దేవాలయం వెలుపల కార్యక్రమ వేదిక వద్ద ముగిసింది.

ఈ ర్యాలీ, సభలో కర్నాటక‌ సాంస్కృతిక శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సునీల్ కుమార్, ఉడిపి ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు రఘుపతి భట్, ఇటీవల బిజెపిలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ మధ్వరాజ్ తో సహా అనేక మంది బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ర్యాలీ జరగడం విశేషం కాదు కానీ ఆ ర్యాలీ, బహిరంగ సభ చేసిన డిమాండ్ ఆందోళనకరమైనది. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని ఈ ర్యాలీ డిమాండ్ చేసింది. కత్తులు ఎత్తి పట్టి కార్యకర్తలు "మేము హిందూ రాష్ట్రాన్ని నిర్మిస్తాము" అనే నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్‌తో సహా బీజేపీ నాయకులంతా ఈ నినాదాలతో గొంతు కలిపారు.

అక్కడితో ఆగలేదు హిందువులు ఆయుధాలు పట్టుకోవాలని పిలుపునిచ్చారు పలువురు వక్తలు... ''ప్రతి హిందువు ఇంట్లో ఆయుధం ఉండాలి.. తదుపరి ఆయుధ పూజలో హిందువులు యంత్రాలను, మిక్సీలను, గ్రైండర్లను పూజించకూడదు, ఆయుధాలను పూజించాలి. ఆ ఆయుధాలను వినియోగించే మనస్తత్వాన్ని పెంపొందించుకుందాం. ఇదే హిందువుల లక్ష్యం. " అని పరిచయ ప్రసంగం చేసిన ఉడిపికి చెందిన టెలివిజన్ రిపోర్టర్ శ్రీకాంత్ శెట్టి కర్కాల అన్నారు.

హిజాబ్ వివాదాన్ని ప్రస్తావిస్తూ శ్రీకాంత్ శెట్టి, హిందూ జాగరణ వేదిక హిందూ అబ్బాయిలను తమ ముస్లిం క్లాస్మేట్స్ ను ఎదుర్కొనేలా తయారుచేయడంలో కీలకపాత్ర పోషించిందని అన్నారు. "దుర్గాదౌడ్ నుండి కాషాయ తలపాగాలు ఇప్పుడు కాలేజీలలోకి వచ్చాయి. దుర్గాదౌడ్ వల్లనే సమాజం మారుతోంది. చైతన్యం పొందుతోంది, ఈ సారి వివాదం వస్తే కాషాయ తలపాగాలు కాదు కత్తులు ఉంటాయి." అని శ్రీకాంత్ శెట్టి అన్నారు.

ఈ ర్యాలీలో పాల్గొన్న గుజరాత్ కు చె‍ందిన కరడుగట్టిన హిందుత్వ నాయకురాలు కాజల్ బెన్ శింగలా ఎలియాస్ కాజల్ హిందుస్తానీ, కర్ణాటకలోని ముస్లిం వ్యాపారాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

"మీరు వారికి ఇచ్చే డబ్బుతో, వారు మీ కుమార్తెలను తీసుకొని పారిపోతారు. అదే డబ్బుతో, వారు ఆయుధాలు, గన్‌పౌడర్‌లను కొంటారు, శిక్షణా శిబిరాలను నడుపుతారు. అబ్బాయిలను జిహాదీలుగా మారుస్తారు, తద్వారా వారు ప్రజల తలలను నరికేస్తారు" అని కాజల్ ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారు..

ఆమె బాలీవుడ్‌ను కూడా లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా కరణ్ జోహార్‌ను అనుమతించవద్దని ప్రేక్షకులను కోరింది. "దక్షిణ భారతదేశంలో దేవాలయాలతో సాంస్కృతిక వాతావరణం ఉంది, కానీ కరణ్ జోహార్ దేవాలయాలను చూపుతారు, అలీ మౌలా అని చెబుతారు. అతడిని దక్షిణాదికి రానివ్వొద్దు'' అని కాజల్ చెప్పింది. మతాంతర ప్రేమను చర్చించే మూడు హిందీ చిత్రాల పై ఆమె విరుచుకపడింది. అత్రంగి రే, తూఫాన్, కేదార్‌నాథ్ సినిమాలు 'లవ్ జిహాద్'ను ప్రోత్సహిస్తున్నాయని ఆమె ఆరోపించింది.

ఇక్కడే మరో విశేషం జరిగింది. ఆందోళనకరమైన, విద్వేష‌పూరిత వాతావరణంలో ఓ ఆశా కిరణంలా ఇదే స్థలంలో అతి కొద్ది మందితో మరో ర్యాలీ జరిగింది. మత సామరస్యం కోసం పనిచేస్తున్న సంస్థల కూటమి 'సహబల్వే' అనే సంస్థ నిర్వహించిన ఈ ర్యాలీలో వివిధ మతాలకు చెందిన 200 మంది ప్రజలు మూడురంగుల‌ జెండాలను పట్టుకుని పాల్గొన్నారు. వందేమాతర గీతం ఆలపిస్తూ....'సబ్ కో సన్మతి దే భగవాన్' అనే నినాదాలతో ఒక దేవాలయం వద్ద ప్రారంభమై, ఒక మసీదు, చర్చి వద్ద ఆగి చివరికి గాంధీ భవన్ వద్ద ముగిసింది.

ఇవి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా జరిగిన రెండు ఊరేగింపులు....రెండు భావజాలాలు.... ఒకరు గాంధీ భావజాలాన్ని నమ్మినవారైతే మరొకరు గాంధీని హత్య చేసిన గాడ్సే భావజాల పరిరక్షకులు.

మహాత్మా..., మీ పేరుతో మీ హంతకుల భావజాలాన్ని మోస్తున్న‌ మమ్మల్ని క్షమించకు.

First Published:  5 Oct 2022 3:45 AM GMT
Next Story