''హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బహిష్కరించండి, కాషాయ జెండాలు ఎగురవేయండి''
కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని బహిష్కరించాలని హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద గిరి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగురేయాలని ఆయన హిందువులకు సూచించాడు.
ద్వేషపూరిత ప్రసంగాలకుపేరెన్నిక గల, పలు ద్వేషపూరిత ప్రసంగాల కేసుల్లో నిందితుడైన హిందుత్వ నాయకుడు యతి నర్సింహానంద గిరి మళ్ళొక సారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. హిందువులందరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని బహిష్కరించాలని, ప్రతి ఇంటిపై కాషాయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చాడు.
ఈ జెండాలు తయారు చేసే ఆర్డర్ ముస్లింలకు ఇచ్చారని, హిందువులెవ్వరూ జాతీయ జెండాలను కొనుగోలు చేయవద్దని ఆయన కోరారు. స్క్రోల్ వెబ్ సైట్ నివేదిక ప్రకారం...
"హర్ ఘర్ తిరంగా ప్రచారం కోసం అతిపెద్ద ఆర్డర్ పశ్చిమ బెంగాల్‌లోని సలావుద్దీన్ అనే ముస్లిం వ్యక్తి యాజమాన్యంలోని ఒక కంపెనీకి ఇవ్వబడింది," అని ఆయన శుక్రవారం, ఆగస్టు 12న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో పేర్కొన్నారు.
"ఇది హిందువులపై పెద్ద కుట్ర. మీరు [హిందువులు] సజీవంగా ఉండాలనుకుంటే, ఈ ప్రచారం పేరుతో ముస్లింలకు మీ డబ్బు ఇవ్వడం ఆపండి.'' అని ఆయన అన్నారు.
హిందూ రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు ముస్లింల ఆర్థిక బహిష్కరణ కోసం ప్రచారం చేస్తున్నారని, వారు అధికారంలోకి వచ్చాక ముస్లింలకే ప్రభుత్వ కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆయన అన్నారు.
"ఈ రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పండి... వారు మీ [హిందువుల] డబ్బును ముస్లింలను ధనవంతులుగా చేయడానికి ఉపయోగిస్తున్నారు. మీ పిల్లలను చంపడానికి వారికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్యక్తుల ఉచ్చులో పడకండి, "అని అతను వీడియోలో చెప్పాడు.
"ప్రతి హిందువు తన ఇంటిపై కాషాయ రంగు జెండాను కలిగి ఉండాలి" అని ఆయన అన్నారు.
ये नफ़रती खुलेआम @narendramodi के #HarGharTiranga अपील को चुनौती दे रहा है। कह रहा है कि तिंरगे ने ही बर्बाद कर दिया है। तिरंगे का बहिष्कार करो।
— Vinod Kapri (@vinodkapri) August 12, 2022
ऐसे देशद्रोही पर कब कार्रवाई होगी @AmitShah @Uppolice @DelhiPolice @CPDelhi pic.twitter.com/jvz42joJHE
'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమం కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జెండాల కోసం ఆర్డర్లు ఇచ్చిన తొమ్మిది
కంపెనీల్లో కోల్‌కతాకు చెందిన సలావుద్దీన్ మోండల్ కు చెందిన కంపెనీ కూడా ఒకటి అని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలకు మూడు లేదా నాలుగు కోట్ల త్రివర్ణ పతాకాలను పంపాలని భావిస్తున్నట్లు మోండల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బెంగాల్‌లోని అనేక విద్యా సంస్థలు, ఇతర సంస్థలు కూడా అతనికి ఆర్డర్లు ఇచ్చాయి.
"దీని వల్ల నా వ్యాపారానికి ఊపు వస్తుందనడంలో సందేహం లేదు, అయితే దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం కోసం నేను జెండాలు తయారు చేయడంవల్ల కలిగే గర్వంతో పోలిస్తే వ్యాపారం పెద్ద విషయం కాదు " అని మోండల్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. "ప్రతి ఇంటికి త్రివర్ణ పతాకం ఉండేలా చూసుకునే బాధ్యత నాకు ఇవ్వడం నా అదృష్టం" అని ఆయన అన్నారు.
ఇక మిలిటెంట్ హిందుత్వ నాయకుడు నర్సింహానంద్ ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
జనవరిలో, నర్సింహానంద్ రెండు వేర్వేరు కేసుల్లో అరెస్టయ్యాడు: ఒకటి మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసిన కేసు కాగా, మరొకటి హరిద్వార్ ధర్మ సంసద్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగాల కేసు. ఈ రెండు కేసుల్లోనూ ఆయన బెయిల్‌పై ఉన్నాడు.
గతంలో ఈ యన ముస్లింలపై అనేక ద్వేష పూరిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో, భారతదేశం ఇస్లామిక్ దేశంగా మారకుండా నిరోధించడానికి ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని హిందువులను కోరాడు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అతనికి సూచించింది.
మహమ్మద్ ప్రవక్తపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు గాను జూన్‌లో ఘజియాబాద్ పోలీసులు అతనికి సమన్లు జారీ చేశారు. అయితే ఇలా ఆయన అనేక సార్లు వ్యాఖ్యలు చేసినా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఒక వైపు అనేక విమర్శల తర్వాత ఆరెస్సెస్ తన సోషల్ మీడియా అకౌంట్ల డీపీలుగా జాతీయ జెండాలను పెట్టిన రోజే నర్సింహానంద, జాతీయ జెండాలు ఎగురవేయొద్దని, కాషాయ జెండాలు ఎగరేయాలని హిందువులకు పిలుపునివ్వడం యాదృచ్చికమా ?