వరదలు.. విరిగిపడుతున్న కొండ చరియలు
స్వాతంత్ర దినోత్సవాలకు కూడా హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు దూరంగా ఉన్నాయి. ఆగస్ట్-19 వరకు హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీకి సెలవలు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో 1200 రహదారులు దెబ్బతిన్నాయి.
ఆమధ్య భారీ వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్ మళ్లీ బియాస్ నది ధాటికి అల్లాడిపోతోంది. ఓవైపు వరదలు, మరోవైపు విరిగి పడుతున్న కొండ చరియలతో హిమాచల్ వాసులు ప్రాణ భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. 4రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ లో 56మంది మృతి చెందారని అధికారిక సమాచారం. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 19. అక్కడక్కడా తప్పిపోయిన వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. వారిలో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో, ఇంకెంతమంది శిథిలాల కింద ఉన్నారో, వరదనీటిలో కొట్టుకుపోయారో తేలాల్సి ఉంది.
హిమాచల్ రాజధాని సిమ్లాలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కళ్లముందే ఇళ్లు పేకమేడల్లా కూలిపోతున్నాయి. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలతోపాటు, పెద్ద పెద్ద భవంతులు కూడా కూలిపోతున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిమ్లా, సోలన్, మండీ, హమీర్ పుర్, కాంగ్రా జిల్లాల్లో నష్టం భారీగా జరిగింది. దాదాపు 10వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
స్వాతంత్ర దినోత్సవాలకు కూడా హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు దూరంగా ఉన్నాయి. ఆగస్ట్-19 వరకు హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీకి సెలవలు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 12 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో 1200 రహదారులు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు నెలల్లో రూ.7,171 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అటు ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ స్తంభించింది.