Telugu Global
National

కాంగ్రెస్‌కు షాక్‌.. పతనం అంచున హిమాచల్ సర్కార్‌

కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ హర్యానాకు తరలించిందని సీఎం సుఖ్విందర్ సింగ్ ఆరోపించారు. మరోవైపు బీజేపీ సైతం సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని ఆరోపిస్తోంది.

కాంగ్రెస్‌కు షాక్‌.. పతనం అంచున హిమాచల్ సర్కార్‌
X

హిమాచల్ ప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పతనం అంచున ఉన్నట్లు తెలుస్తోంది. సుఖ్విందర్ సింగ్ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇక రాజ్యసభ స్థానానికి జరిగిన పోలింగ్‌లో భారీగా క్రాస్‌ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు చెరో 34 ఓట్లు పడ్డాయి. దీంతో డ్రా తీయగా బీజేపీ అభ్యర్థి హర్షమహాజన్‌ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను బీజేపీ హర్యానాకు తరలించిందని సీఎం సుఖ్విందర్ సింగ్ ఆరోపించారు. మరోవైపు బీజేపీ సైతం సుఖ్విందర్ సింగ్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని ఆరోపిస్తోంది. గురువారం సుఖ్విందర్‌ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని బీజేపీ నేతలు చెప్తున్నారు.

68 మంది సభ్యులున్న హిమాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ 40 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టే ప్లాన్‌లో భాగంగానే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ పాలిత హర్యానా రాష్ట్రానికి తరలించినట్లు భావిస్తున్నారు. సీఎం సుఖ్విందర్ సింగ్ తీరుపై పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

First Published:  27 Feb 2024 9:22 PM IST
Next Story