Telugu Global
National

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చలికాలంలో ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే సింగిల్ ఫేజ్‌లో ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ స్పష్టం చేశారు.

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. నవంబర్ 12 సింగిల్ ఫేజ్‌లో పోలింగ్ నిర్వహిస్తామని, డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇవాళ ఈసీఐ ప్రెస్ మీట్ ఉంటుందని ఉదయమే మీడియా సంస్థలకు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సమాచారం అందించింది. దీంతో గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ ఎలక్షన్ కమిషన్ కేవలం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన షెడ్యూల్ మాత్రమే వెల్లడించింది.

హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియడానికి మధ్య 40 రోజుల సమయం ఉందని అందుకే ఒకే సారి షెడ్యూల్ ప్రకటించలేదని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చలికాలంలో ఉండే వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే సింగిల్ ఫేజ్‌లో ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, హిమాచల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేష్ ఈ నెల 17న విడుదల కానున్నది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 25, నామినేషన్ల పరిశీలన 27న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 29 వరకు గడువు ఇచ్చారు. కాగా, పోలింగ్ నవంబర్ 12న, ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న నిర్వహించనున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫా ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో తక్కువ ఓటింగ్ నమోదైన సెగ్మెంట్లు, పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. నియోజకవర్గానికి కనీసం ఒక పోలింగ్ స్టేషన్ కేవలం మహిళలచే నిర్వహించబడుతుందని, అలాగే మరొకటి వికలాంగులే నిర్వహిస్తారని కమిషనర్ వెల్లడించారు. 80 ఏళ్ల కంటే పైబడిన వయసు కలిగిన ఓటర్ల వద్దకు పోలింగ్ సిబ్బందే స్వయంగా వెళ్లి ఓటు నమోదు చేస్తారని, ఆ వ్యవహారం అంతా వీడియో షూట్ చేస్తామని కమిషనర్ తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఇతర రాష్ట్రాలతో ఉన్న బోర్డర్స్ అన్నీ మూసేస్తామని అన్నారు. రాష్ట్రంలో 1000 మందికి పైగా 100 ఏళ్ల వయసుకు పైబడిన ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఇక రాష్ట్రంలో 43,0000 ఫస్ట టైం ఓటర్లు రాబోతున్నారని ఆయన అన్నారు. వారికి వెల్కమ్ కిట్స్ జారీ చేస్తామని చెప్పారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకపోవడానికి ఎలాంటి ఒత్తిడి లేదన్నారు. కేవలం వాతావరణ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొనే హిమాచల్‌లో ముందుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాగా హిమాచల్ ప్రదేశ్ పోలింగ్, ఓట్ల లెక్కింపు మధ్య దాదాపు నెల రోజుల సమయం ఉన్నది. దీంతో ఆ సమయంలో గుజరాత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

First Published:  14 Oct 2022 4:07 PM IST
Next Story