Telugu Global
National

బీహార్ లోనూ హిజాబ్ గొడవ.. చివరకు ఏమైందంటే.. ?

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కొందరు హెడ్ ఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలతో వస్తున్నారని ఇన్విజిలేటర్లు అనుమానించారు. హిజాబ్ ఉంటే చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకున్న విషయం తెలియదని, చెవుల వరకు ఉన్న హిజాబ్ ని తొలగించాలని ఇన్విజిలేటర్ కోరారు.

బీహార్ లోనూ హిజాబ్ గొడవ.. చివరకు ఏమైందంటే.. ?
X

కర్నాటకను కుదిపేసిన హిజాబ్ గొడవ ఇప్పుడు బీహార్ లోకి కూడా ప్రవేశించింది. అయితే బీహార్ లో ఇది చిన్న వివాదంగానే సమసిపోయింది. అధికారుల విచారణలో ఇన్విజిలేటర్ల తప్పేమీ లేదని తేలింది. ఆదివారం నిర్వహించిన ఓ పరీక్ష సందర్భంగా హిజాబ్ వివాదం తెరపైకి వచ్చింది.

బీహార్ రాష్ట్రం ముజఫర్‌ పూర్‌ లోని మహంత్‌ దర్శన్‌ దాస్‌ మహిళా కాలేజీలో ఆదివారం విద్యార్థినులకు పరీక్షలు జరిగాయి. ఈ ప్రీ ఫైనల్ పరీక్ష రాసి పాసైనవారే, ఆ తర్వాత ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినుల్లో కొంతమంది హిజాబ్ ధరించారు. సహజంగా వారు కాలేజీకి కూడా హిజాబ్ ధరించి వస్తారు. కానీ పరీక్షకు కూడా హిజాబ్ ధరించి రావడంతో తనిఖీలలో భాగంగా ఇన్విజిలేటర్ వచ్చి హిజాబ్ ని చెవులపైనుంచి తొలగించాలని సూచించారు. దీనికి ఆ విద్యార్థిని నిరాకరించింది. మాటా మాటా పెరిగింది. ఇన్విజిలేటర్ మాటలకు విద్యార్థిని మనస్థాపానికి గురైంది. వెంటనే ఆ వ్యవహారం పేరెంట్స్ కి తెలిపింది. ఆ అమ్మాయి పేరెంట్స్, బంధువులు కాలేజీ వద్దకు వచ్చి గొడవకు దిగడంతో కాలేజీ ఉన్నతాధికారులు ఎంక్వయిరీ చేపట్టారు. చివరకు ఇన్విజిలేటర్ తప్పేమీ లేదని నిర్థారించారు. తల్లిదండ్రులకు సర్దిచెప్పి పంపించేశారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల్లో కొందరు హెడ్ ఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలతో వస్తున్నారని ఇన్విజిలేటర్లు అనుమానించారు. హిజాబ్ ఉంటే చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకున్న విషయం తెలియదని, చెవుల వరకు ఉన్న హిజాబ్ ని తొలగించాలని ఇన్విజిలేటర్ కోరారు. కేవలం చెవులు కనిపించేలా మాత్రమే తాను హిజాబ్ తొలగించాలని సూచించానని, కానీ ఆ విద్యార్థిని వినలేదని, తనపైనే ఎదురుదాడికి దిగిందని ఇన్విజిలేటర్ వివరణ ఇచ్చారు.

హిజాబ్ వివాదం చెలరేగడంతో ఆ ప్రాంతంలోని హిందూ సంఘాలు కూడా కాలేజీ వద్దకు వచ్చాయి. కర్నాటకలో లాగా ఇక్కడ కూడా నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశాయి. చివరకు కాలేజీ సిబ్బంది ఇరు వర్గాలకు సర్దిచెప్పి పంపించేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది.

First Published:  17 Oct 2022 2:30 AM GMT
Next Story