రాజధాని ఢిల్లీకి హై అలర్ట్.. - లోతట్టు ప్రాంతాల ప్రజలు సత్వరం ఖాళీ చేయాలని ఆదేశం
అప్రమత్తమైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
యమునా నది తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెనువెంటనే తరలివెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఏమాత్రం వేచి చూడరాదని స్పష్టం చేశారు. అంతకంతకూ పెరిగిన యమునా నది ఉద్ధృతి బుధవారం రికార్డు స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జ్ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించింది. సాయంత్రం 4 గంటల సమయానికి అది మరో 0.71 పెరిగి 207.71గా నమోదైందని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తెలిపింది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. యమునా నది 1978లో నమోదైన గరిష్ట 207.49 మీటర్ల రికార్డు స్థాయిని దాటింది. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని కేజ్రీవాల్ తెలిపారు. నదీ సమీప ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు.
దేశ రాజధానికి వరద సూచన ప్రపంచ దేశాలకు సరైన మెసేజిని ఇవ్వదని, ఢిల్లీ ప్రజలను కలిసి కాపాడదామని, బుధవారం రాత్రికి యమునా నది 207.72కు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తెలిపిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. త్వరలో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో యుమునా వరదను త్వరగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం రాకపోయినా యమునా నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీకి పైన ఉన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరఖండ్‌లలో వర్షాల కారణంగా వరద యమునకు పోటెత్తుతోంది. ఢిల్లీ పైన ఉన్న హర్యానాలోని హత్నీకుండ్ డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల యుమునా నది ప్రవాహం పెరుగుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఆ డ్యామ్ నుంచి పరిమితంగా నీటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.