Telugu Global
National

9 రాష్ట్రాల్లో జలవిలయం.. 19మంది దుర్మణం

భారీ వర్షాలకు అత్యథికంగా ప్రభావితం అయిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. బియాస్ నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి.

9 రాష్ట్రాల్లో జలవిలయం.. 19మంది దుర్మణం
X

దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా , జమ్మూ కశ్మీర్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్, అసోం రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జనజీవనం స్తంభించి పోయింది. వర్షాలు, కొండచరియలు విరిగి పడిన ఘటనలో మొత్తం 19మంది దుర్మరణం పాలయినట్టు అధికారిక సమాచారం. వీరిలో ఇద్దరు జవాన్లు కూడా ఉన్నారు. ఆస్తి నష్టం లెక్క ఇప్పుడల్లా తేలేలా లేదు. వంతెనలు దెబ్బతినడం, ఇళ్లు కూలిపోవడం, వాహనాలు బొమ్మల్లా వరదనీటిలో కొట్టుకుపోవడం వంటి సంఘటనలు జలవిలయం తీవ్రతను తెలియజేస్తున్నాయి.


40ఏళ్ల తర్వాత ఢిల్లీలో విలయం..

ఢిల్లీలో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు 36 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత ఇంత తక్కువ వ్యవధిలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని అధికారులు తెలిపారు. మరో 2 రోజులపాటు ఢిల్లీలో పరిస్థితి ఇలాగే ఉంటుందని అంచనా. గురుగ్రామ్, నోయిడా ప్రాంతాల్లో ఇప్పటికే స్కూళ్లకు సెలవలు ప్రకటించారు. పలు అపార్ట్ మెంట్లలోకి నీరు చేరింది. 16చోట్ల కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్థితి సమీక్షిస్తున్నారు అధికారులు.

భారీ వర్షాలకు అత్యథికంగా ప్రభావితం అయిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. బియాస్ నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. 14చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 70రోడ్లు మూసివేశారు. ఉత్తరాఖండ్, హరియాణాలో కూడా జలవిలయానికి ప్రజలు బలయ్యారు. అసోంలో బ్రహ్మపుత్ర ఉగ్రరూపందాల్చింది.


రాకపోకలు వద్దు..

ఆయా రాష్ట్రాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రయాణాలు నిలిపివేయాలని చెబుతున్నారు. దాదాపు 20 రైళ్లను అధికారులు నిలిపివేశారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వచ్చినవారు కూడా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు. అలాంటివారి సమాచారం తెలిపేందుకు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు, వరదలతో 9 రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు.

First Published:  10 July 2023 8:20 AM IST
Next Story