ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీం కోర్టులో నేడే విచారణ
తనకు ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని, మహిళనైన తనను ఇంటి వద్దే విచారించాలని, తనను అరెస్టు చేయవద్దని ఈడీని ఆదేశించాలని కల్వకుంట్ల కవిత కోర్టును కోరారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సమన్లు జారీ చేసి ఇప్పటికే మూడు సార్లు విచారించిన విషయం తెలిసిందే. అయితే తనకు ED సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తనకు ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని, మహిళనైన తనను ఇంటి వద్దే విచారించాలని, తనపై అరెస్టు లాంటి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు.
ముందుగా ఈ కేసు ఈ నెల 24 కు లిస్ట్ చేసినప్పటికీ ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ బేలా త్రివేది ల ధర్మాసనం విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు.
మరో వైపు కవిత పిటిషన్ నేపథ్యంలో ఈడీ సుప్రీం కోర్టులో కేవియట్ దాఖలు చేసింది. తమ వాదనలు కూడా విన్న తర్వాతనే కవిత పిటిషన్ పై ఓ నిర్ణయానికి రావాలని ఈడీ సుప్రీంను కోరింది. దీంతో సుప్రీం కోర్టు ఇరువర్గాల వాదనలను విన్న తర్వాతనే తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.