త్వరగా పిల్లల్ని కనండి.. నవ దంపతులకు సీఎం విజ్ఞప్తి
ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సూచించారు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజలు తక్షణమే పిల్లల్ని కనాలని కోరారు. లోక్‌సభ నియోజకవర్గ పునర్విభజన విషయంలో నష్టం జరగకుండా ఉండాలంటే కొత్తగా పెళ్లయిన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘నూతన దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేనే చెప్పా. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పుడలా చెప్పలేను.
అంతకుముందు మేం కుటుంబ నియంత్రణపై దృష్టిసారించాం. కానీ ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం. అందుకే నేను కోరుకునేది ఒక్కటే. కొత్తగా పెళ్లయిన దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి’’ అని ముఖ్యమంత్రి తమిళ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన కుటుంబ నియంత్రణ విజయవంతంగా అమలు చేసి ఫ్యామిలీ ఫ్లానింగ్ ఇప్పుడు డిస్‌అడ్వాంటేజీగా మారిందని సీఎం తెలిపారు.