కార్పొరేటర్ టికెట్ కోసం కరెంటు స్తంభం ఎక్కాడు..
గతంలో బీజేపీ పాలనలో ఉన్న తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదంటూ హసన్ మురికి కాల్వలో దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు పార్టీ టికెట్ నిరాకరించడంతో మరోసారి టవర్ ఎక్కి ఇలా వార్తల్లోకెక్కారు.
ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ కి ఎంత డిమాండ్ ఉందో చెప్పే సంఘటన ఇది. మాజీ కార్పొరేటర్ హసీబ్ ఉల్ హసన్ కు ఈసారి టికెట్ నిరాకరించారు కేజ్రీవాల్. దీంతో ఆయన ఏకంగా హైటెన్షన్ టవర్ ఎక్కారు. తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారాయన. టికెట్ ఇచ్చే వరకు కిందకు దిగేది లేదంటున్నారు హసీబ్. ఆత్మహత్యే తనకు శరణ్యం అంటూ బెదిరిస్తున్నారు.
ఎవరీ హసన్..?
గతంలో బీజేపీ పాలనలో ఉన్న తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేదంటూ హసన్ మురికి కాల్వలో దిగి నిరసన తెలిపారు. గుండెల్లోతు మురికి నీటిలో ఆయన చేసిన విన్యాసం సంచలనంగా మారింది. అప్పటినుంచి హసన్ వార్తల్లో వ్యక్తిగా మారారు. తాజాగా ఆయనకు పార్టీ టికెట్ నిరాకరించడంతో మరోసారి టవర్ ఎక్కి ఇలా వార్తల్లోకెక్కారు హసన్.
డిసెంబర్ 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యేకి సైతం ఈసారి కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చి బరిలో దింపింది ఆప్. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసి అభ్యర్థుల్ని ప్రకటించిన కేజ్రీవాల్ సగానికి సగం సీట్లు మహిళలకు కేటాయించి మార్పునకు శ్రీకారం చుట్టారు. గతంలో మూడు కార్పొరేషన్లు ఉండగా, ఇప్పుడు ఒకటే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఒకేసారి ఎన్నికలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఆప్ పెత్తనం ఉన్నా, కార్పొరేషన్లలో ఇప్పటి వరకూ బీజేపీ పెత్తనం కొనసాగింది. ఈసారి ఎలాగైనా ఢిల్లీ కార్పొరేషన్ ని సైతం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు కేజ్రీవాల్. అభ్యర్థుల వడపోతలో హసన్ వంటివారు టికెట్ కోల్పోయారు.