Telugu Global
National

కెన‌డా నుంచి ర‌ప్పించి.. ప్రాణం తీశాడు.. - హర్యానాలో దారుణం

మోనిక కెన‌డా నుంచి వ‌చ్చిన‌ట్టు తెలియ‌ని త‌ల్లిదండ్రులు.. ఫోన్‌కు ఆమె స్పందించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ద‌ర్యాప్తులో మోనిక సునీల్‌తో స‌న్నిహితంగా మెలిగిన‌ట్టు గుర్తించారు.

కెన‌డా నుంచి ర‌ప్పించి.. ప్రాణం తీశాడు.. - హర్యానాలో దారుణం
X

ప్రియురాలిని కెన‌డా నుంచి ర‌ప్పించి మ‌రీ ప్రాణం తీశాడో ప్రియుడు. గ‌తేడాది జూన్‌లో జ‌రిగిన ఈ విష‌యం తాజాగా వెలుగు చూడ‌టంతో నిందితుడు పోలీసుల‌కు చిక్కాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

మృతురాలు మోనిక (23) స్వ‌స్థ‌లం రోహ్‌త‌క్ ప్రాంతంలోని బాలంద్ గ్రామం. ఐఈఎల్‌టీఎస్ శిక్ష‌ణ కోసం త‌న మేన‌త్త నివాసం ఉంటున్న సోనిప‌త్ ప్రాంతంలోని గుమాడ్ గ్రామానికి వెళ్లింది. అదే గ్రామంలో నివాసం ఉండే సునీల్ అనే వ్య‌క్తితో ఆమెకు ప‌రిచ‌యమై అత‌నితో ప్రేమ‌లో ప‌డింది. అత‌నికి అప్ప‌టికే వివాహ‌మైంది. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆ విష‌యం మోనిక‌కు కూడా తెలుసు.

ఆ త‌ర్వాత ఉన్న‌త చ‌దువుల కోసం కెన‌డా వెళ్లిన మోనిక మ‌ధ్య‌లో రెండుసార్లు త‌న త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌కుండా ఇండియాకు వ‌చ్చి సునీల్‌ని క‌లిసి వెళ్లింది. ఆ త‌ర్వాత కొద్దిరోజుల‌కు మోనిక‌కు ఫోన్ చేసి ఇండియాకు ర‌ప్పించాడు సునీల్‌. 2022 మే నెల‌లో వారిద్ద‌రూ ఘ‌జియ‌బాద్‌లోని గుడిలో పెళ్లి చేసుకున్నారు.

ఆ త‌ర్వాత ఓరోజు ఆమెను త‌న ఫామ్ హౌస్‌కు తీసుకెళ్లిన సునీల్ అక్క‌డ ఆమెతో త‌నను కూడా కెన‌డాకు తీసుకెళ్లాల‌ని చెప్పాడు. అక్క‌డే ఇద్ద‌రూ సెటిలైపోదామ‌ని అన్నాడు. అందుకు మోనిక ఒప్పుకోలేదు. తానే ఇండియాకు వ‌చ్చేస్తాన‌ని, ఇక్క‌డే ఉందామ‌ని చెప్పింది. ఈ విష‌య‌మై వారిద్ద‌రి వాగ్వాదం పెరిగింది. ఎంత చెప్పినా విన‌క‌పోవ‌డంతో ప‌ట్ట‌రాని ఆవేశంతో సునీల్ మోనిక‌ను త‌న తుపాకీతో కాల్చి చంపాడు. అనంత‌రం ఆమె మృత‌దేహాన్ని త‌న ఫామ్ హౌస్‌లోనే వాట‌ర్ ట్యాంక్ కోసం త‌వ్వి ఉంచిన 10 అడుగుల నీటి గుంత‌లో పాతిపెట్టాడు.

మోనిక కెన‌డా నుంచి వ‌చ్చిన‌ట్టు తెలియ‌ని త‌ల్లిదండ్రులు.. ఫోన్‌కు ఆమె స్పందించ‌క‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ద‌ర్యాప్తులో మోనిక సునీల్‌తో స‌న్నిహితంగా మెలిగిన‌ట్టు గుర్తించారు. సునీల్‌ని అదుపులోకి తీసుకొని త‌మ‌దైన ప‌ద్ధ‌తిలో విచార‌ణ చేయ‌గా, నేరం అంగీక‌రించాడు. సునీల్ ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఫామ్ హౌస్‌లో మృత‌దేహాన్ని ఇటీవ‌ల వెలికితీయ‌గా, అస్తిపంజ‌రం ల‌భించింది. పోలీసులు గురువారం ఈ వివ‌రాలు మీడియాకు వెల్ల‌డించారు.

First Published:  7 April 2023 8:37 AM IST
Next Story