Telugu Global
National

హర్యానా: ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థులు రూ.2.11 కోట్లు, కారు బహుమతి

హర్యానాలోని ఓ గ్రామ పంచాయితీలో సర్పంచ్ గా ఓడిపోయిన ఓ అభ్యర్థికి గ్రామ ప్ర‌జలందరూ కలిసి రూ.2.11 కోట్లు, స్కార్పియో ఎస్‌యూవీని బహుకరించారు. ఆ వ్యక్తి కేవలం 66 ఓట్ల తేడాతో ఓడిపోయారు. .

హర్యానా: ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తికి గ్రామస్థులు రూ.2.11 కోట్లు, కారు బహుమతి
X

ప్ర‌స్తుత రాజ‌కీయాల‌కు భిన్నంగా అక్క‌డ గ్రామ‌స్థులు ఆద‌ర్శ‌ప్రాయంగా నిలుస్తున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వారిపై ఆధిప‌త్యం చెలాయించ‌డం, గేలిచేయ‌డం, ప్ర‌త్య‌ర్ధుల‌పై క‌క్ష సాధింపులు వంటివి జ‌రుగుతున్నరోజుల్లో.. ఓడిపోయిన వ్య‌క్తికి కోట్లాది రూపాయ‌ల‌తో పాటు ఓ మంచి కారును బ‌హుమ‌తిగా ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు. హ‌ర్యానాలోని రోహ్‌తక్ జిల్లా చిరి గ్రామంలో ఇటీవ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నికల్లో ధరంపాల్ అలియాస్ కాలా కేవలం 66 ఓట్ల తేడాతో ఓడిపోయారు. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయిన తోటి గ్రామస్థుడు ధ‌రంపాల్ కు చిరి గ్రామ నివాసితులు రూ.2.11 కోట్లు, స్కార్పియో ఎస్‌యూవీని బహుకరించారు.

.

శుక్రవారం ధర్మపాల్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. దీనికి వివిధ ఖాప్‌ల ప్రతినిధులు, లఖన్ మజ్రా బ్లాక్‌లోని అనేక గ్రామాల ప్ర‌జ‌లు కూడా హాజరయ్యారు. స్థానికులు ఆయనను తలపాగా, పూలమాలలతో సత్కరించారు.

గ్రామంలో సోదరభావాన్ని కాపాడేందుకే ఈ స‌త్కారం చేశామ‌ని, అభ్యర్థి మనోధైర్యం దెబ్బతినకూడదని సౌభ్రాతృత్వాన్ని చాటుకున్నామ‌ని స్థానికులు తెలిపారు. ఇదొక్కటే కాదు, వివిధ ఖాప్ పంచాయతీలు కూడా అతనిని గౌరవించాలని, ఖాప్ పంచాయతీలలో ముఖ్యమైన పదవులను ఇవ్వాలని నిర్ణయించాయి. రోహ్తక్ జిల్లాలోని చిరి గ్రామం మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా లోయి అసెంబ్లీ స్థానం ప‌రిధిలోని గ్రామం. లఖన్ మజ్రా బ్లాక్ సమితి చైర్మన్‌గా ధరంపాల్ పనిచేశారు. అతని తల్లి , తాత చిరి గ్రామ సర్పంచ్‌లుగా పనిచేశారు.

First Published:  20 Nov 2022 6:22 AM
Next Story