Telugu Global
National

అండ‌మాన్‌కి పారిపోయినా.. ప‌ట్టేశారు

అతడిని మరోసారి అరెస్టు చేయాలంటూ 2012లో కోర్టు వారెంట్ జారీ చేసింది. అప్పటినుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత.. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లోని 'క్యాంప్‌బెల్ బే'లో అతడి ఆచూకీని గుర్తించారు.

అండ‌మాన్‌కి పారిపోయినా.. ప‌ట్టేశారు
X

భార్య హ‌త్య కేసులో నిందితుడైన వ్య‌క్తి.. బెయిల్‌పై విడుద‌లై అండ‌మాన్‌కి పారిపోయాడు. అక్క‌డికైతే ఇక ఎవ‌రూ రార‌ని, త‌న‌ను ప‌ట్టుకోలేర‌ని భావించిన‌ట్టున్నాడు. అందుకే అండ‌మాన్‌లోనూ ఓ మారుమూల ప్రాంతానికి వెళ్లి అక్క‌డే జీవ‌నం సాగిస్తున్నాడు. కానీ, 11 సంవ‌త్స‌రాల త‌ర్వాత పోలీసులు అత‌న్ని ప‌ట్టేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.

నిందితుడు ఏపీ సెల్వన్ (54) తన భార్యతో కలిసి హరియాణాలోని అంబాలాలో నివసించేవాడు. 2007లో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు సెల్వ‌న్‌పై అనుమానంతో అత‌న్ని అరెస్ట్ చేశారు. అయితే.. అత‌నిపై సాక్ష్యాలు లేక‌పోవ‌డంతో బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. కేసు ద‌ర్యాప్తు చేస్తున్న క్ర‌మంలో భార్య హ‌త్య కేసులో సెల్వ‌న్ ప్ర‌మేయం ఉన్న‌ట్టు పోలీసులు గుర్తించారు.

దీనికి సంబంధించి సేకరించిన సాక్ష్యాలను అంబాలా కోర్టు ముందు ఉంచడంతో.. అతడిని మరోసారి అరెస్టు చేయాలంటూ 2012లో కోర్టు వారెంట్ జారీ చేసింది. అప్పటినుంచి నిందితుడు పరారీలో ఉన్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత.. ఇటీవల అండమాన్ నికోబార్ దీవుల్లోని 'క్యాంప్‌బెల్ బే'లో అతడి ఆచూకీని గుర్తించారు. దేశ దక్షిణ చివరి ప్రాంతంగా గుర్తింపు ఉన్న 'ఇందిరా పాయింట్' ఇక్కడే ఉంటుంది.

క్యాంప్‌బెల్ బేకు చేరుకున్న హ‌రియాణా పోలీసులు స్థానిక పోలీసుల సాయంతో సెల్వ‌న్‌ను అరెస్ట్ చేశారు. ప్ర‌స్తుతం అత‌న్ని పోర్ట్ బ్లెయిర్‌లోని జైలులో ఉంచారు. ఈ విష‌యాన్ని అండ‌మాన్ నికోబార్ డీజీపీ వెల్ల‌డించారు. నిందితుడిని ఆదివారం ఢిల్లీకి, అటునుంచి హరియాణాకు తరలించనున్నట్టు పోలీసులు తెలిపారు. భారత ప్రధాన భూభాగానికి చెందిన పోలీసులు.. అండమాన్ లోని ఒక మారుమూల ప్రాంతంలో నిందితుడిని అరెస్టు చేయడం బహుశా ఇదే మొదటిసారని ఓ వార్తాసంస్థ తెల‌ప‌డం గ‌మ‌నార్హం.

*

First Published:  27 Aug 2023 9:08 AM IST
Next Story