Telugu Global
National

దేశంలో మహిళలకు రక్షణ ఎంత గొప్పగా ఉందంటే... మహిళా కమిషన్ చీఫ్ కే వేధింపులు

ఢిల్లీలో రాత్రి పూట ఉద్యోగినిలు, పనుల కోసం బైటికెళ్ళే మహిళల భద్రత ఎలా ఉందో పరిశీలించడానికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నిన్న రాత్రి ఢిల్లీ వీధుల్లో పర్యటించారు. ఆ సందర్భంగా హరీశ్ చంద్ర అనే క్యాబ్ డ్రైవర్ ఈమె దగ్గరికి వచ్చి తన కారు ఎక్కాల్సిందిగా అడిగాడు.

దేశంలో మహిళలకు రక్షణ ఎంత గొప్పగా ఉందంటే... మహిళా కమిషన్ చీఫ్ కే వేధింపులు
X

దేశంలో మహిళల రక్షణ ఎంత గొప్పగా ఉందో తెలియజేసే ఘటన నిన్న రాత్రి ఢిల్లీలో జరిగింది. ఏకంగా మహిళల రక్షణ కోసం పనిచేసే మహిళా కమిషన్ చైర్ పర్సన్ నే ఓ క్యాబ్ డ్రైవర్ వేధించాడు.

ఢిల్లీలో రాత్రి పూట ఉద్యోగినిలు, పనుల కోసం బైటికెళ్ళే మహిళల భద్రత ఎలా ఉందో పరిశీలించడానికి ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ నిన్న రాత్రి ఢిల్లీ వీధుల్లో పర్యటించారు. ఆ సందర్భంగా హరీశ్ చంద్ర అనే క్యాబ్ డ్రైవర్ ఈమె దగ్గరికి వచ్చి తన కారు ఎక్కాల్సిందిగా అడిగాడు. ఈమె నిరాకరించడంతో ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఆమె చేయిని విండోలో ఉంచి గ్లాస్ వేసేసి కారుతో పాటు 10-15 మీటర్లు ఆమెను ఈడ్చేశాడు. ఆ సమయంలో క్యాబ్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు.

''నిన్న అర్థరాత్రి నేను ఢిల్లీలో మహిళల భద్రత పరిస్థితిని పరిశీలించడానికి వెళ్ళాను. ఒక కారు డ్రైవర్ తాగిన మత్తులో నన్ను వేధించాడు. నేను అతనిని పట్టుకున్నప్పుడు, అతను నా చేతిని కారు అద్దంలోకి లాక్కొని నన్ను కారుతోపాటు లాక్కెళ్ళాడు. దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు. మహిళా కమిషన్ చైర్ పర్సనే ఢిల్లీలో సురక్షితంగా లేరంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.'' అని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు.

ఈ సంఘటన‌పై స్వాతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్యాబ్ డ్రైవర్ హరీశ్ చంద్రను అరెస్టు చేశారు.

కాగా 20 ఏళ్ల అంజలీ సింగ్ అనే యువతిని కారుతో 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన కాంఝవాలా హిట్ అండ్ డ్రాగ్ కేసు జరిగిన కొద్ది రోజులకే ఇది జరిగింది.

జనవరి 1న ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పనిచేస్తున్న అంజలి తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా బాలెనో కారు ఆమె వాహనాన్ని ఢీకొట్టింది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం అంజలి కాలు కారు ఎడమ ముందు చక్రానికి తగిలి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు.

ఈ సంఘటన జనవరి 1 తెల్లవారుజామున ఔటర్ ఢిల్లీలోని కంఝవాలాలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతో పాటు వారి సహచరులను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం ఢిల్లీ లో యావరేజ్ గా రోజుకు దాదాపు 35 పైగా మహిళలపై నేరాలు జరుగుతున్నాయి.

First Published:  19 Jan 2023 4:38 PM IST
Next Story