Telugu Global
National

ప్రపంచంలో పాముకాటు మరణాల్లో సగం భారత్ లోనే..

భారత్ లో పాముకాటుకి గురైన 10మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. మిగతా ఏడుగురు నాటు వైద్యాన్ని నమ్ముకుంటున్నారు, కొందరు ఆ వైద్యం కూడా అందుబాటులోలేక, వైద్య సాయం పొందే లోపే మరణిస్తున్నారు.

ప్రపంచంలో పాముకాటు మరణాల్లో సగం భారత్ లోనే..
X

ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి లక్ష మంది పాముకాటు వల్ల మరణిస్తున్నారని అంచనా. అందులో 46,900 మరణాలు కేవలం భారత్ లోనే సంభవిస్తున్నాయి. భారత్ లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకే ఈ సంఖ్యను అంచనా వేశారు. కొన్ని మరణాలు పాముకాటు వల్ల సంభవించినా, పల్లెటూళ్లలో అవి నమోదు కాకపోవడం, ఇతరత్రా కారణాలతో భారత్ లో ఆ మరణాల సంఖ్య అనధికారికంగా ఇంకా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) అధ్యయనంతో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

10మందిలో ముగ్గురే ఆస్పత్రికి..

భారత్ లో పాముకాటుకి గురైన 10మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఆస్పత్రులకు వస్తున్నారు. మిగతా ఏడుగురు నాటు వైద్యాన్ని నమ్ముకుంటున్నారు, కొందరు ఆ వైద్యం కూడా అందుబాటులోలేక, వైద్య సాయం పొందే లోపే మరణిస్తున్నారు. భారత్ లో పాముకాటు మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. అవగాహన లేకపోవడం, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతోనే ఇవి సంభవిస్తున్నాయని చెబుతున్నారు.

భారత్ తో పోల్చి చూస్తే ఆస్ట్రేలియాలో విషపూరిత పాము జాతులు ఎక్కువ. కానీ అక్కడ మరణాలు మాత్రం చాలా తక్కువ. ఆస్ట్రేలియాలో ఏడాదికి పాముకాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్య కేవలం 10నుంచి 12మాత్రమే. అమెరికాలో కూడా మరణాల సంఖ్య 10 నుంచి 15లోపే ఉంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా-మిలియన్ డెత్ స్టడీ (RGI-MDS) ప్రకారం భారత్ లో పాముకాటు మరణాల సంఖ్య ఏడాదికి 46,900. భారత్ లో ఉన్న దారుణ పరిస్థితిని అది తెలియజేస్తోంది. నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల లిస్ట్ లో గతంలో పాముకాటు ఉండేది. ఆ తర్వాత దాన్ని జాబితా నుంచి తొలగించారు. 2013లో తిరిగి దీన్ని నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల లిస్ట్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చేర్చింది.

First Published:  25 Aug 2022 11:46 AM IST
Next Story