జ్ఞానవాపి కేసు: మసీదు తరపు పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు, వేడుకలు జరుపుకుంటున్న హిందూ సంఘాలు
వారణాసి,జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శృంగర్ గౌరీ, ఇతర దేవతలను పూజించే హక్కులను కోరుతూ పలువురు మహిళలు వేసిన కేసును విచారణకు స్వీకరించాలని వారణాసి జిల్లా జడ్జి ఆదేశించారు. ఈ పిటిషన్ ను అనుమతించవద్దన్న ముస్లిం పక్షం అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
వారణాసి లోని జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి డిస్ట్రిక్స్ట్ అండ్ సెషన్స్ కోర్టు ముస్లింల తరపు పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మసీదు ప్రాంగణంలోని హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.తదుపరి విచారణను సెప్టెంబర్ 22వ తేదీకి వాయిదా వేసింది.
జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణంలోని శృంగార్ గౌరీ, ఇతర దేవతలను పూజించే హక్కులను కోరుతూ పలువురు మహిళలు వేసిన కేసును విచారణకు స్వీకరించాలని జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేషా ఆదేశించారు.
హిందూ మహిళలు దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని అంజుమన్ ఇంతేజామియా, మసీదు కమిటీ లు కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో కేసును విచారించిన వారణాసి డిస్ట్రిక్స్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి అజయ్ కృష్ణ విశ్వేషా ఈ తీర్పునిచ్చారు.
కాగా జిల్లా కోర్టు ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్తామని అంజుమన్ ఇంతెజామియా మసాజిద్-మసీదు నిర్వహణ కమిటీ- న్యాయవాది మెరాకుద్దీన్ సిద్ధఖీ తెలిపారు.
మరో వైపు జిల్లా కోర్టు తీర్పుతో హిందూ వర్గాలు వేడుకలు జరుపుకుంటున్నాయి. ఆ వేడుకల్లో పాల్గొన్నహిందూ పక్షం పిటిషనర్ మంజు వ్యాస్ మాట్లాడుతూ, ''భారత దేశం ఈ రోజు ఆనందంగా ఉంది. నా హిందూ సోదరులు, సోదరీమణులు దీపాలను వెలిగించి వేడుకలు జరుపుకోవాలి " అన్నారు.
మరో పిటిషనర్ సోహన్ లాల్ ఆర్య మాట్లాడుతూ, ''ఇది హిందూ సమాజం సాధించిన విజయం. ఇది జ్ఞానవాపి ఆలయానికి పునాది రాయి. శాంతిభద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను'' అన్నారు.