Telugu Global
National

జ్ఞానపీఠ్‌ పురస్కారానికి గుల్జార్, రామభద్రాచార్య ఎంపిక

జ్ఞానపీఠ్‌ అవార్డును 1944లో ఏర్పాటు చేశారు. భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ’జ్ఞానపీఠ్‌ అవార్డు’ను అందజేస్తారు.

జ్ఞానపీఠ్‌ పురస్కారానికి గుల్జార్, రామభద్రాచార్య ఎంపిక
X

జ్ఞానపీఠ్‌ పురస్కారానికి 2023 ఏడాదికి గాను ప్రముఖ ఉర్దూ కవి, సినీ గేయ రచయిత గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ఎంపికయ్యారు. ‘జ్ఞానపీఠ్‌’ 58వ పురస్కారానికి సంబంధించి వివరాలను ఎంపిక కమిటీ శనివారం విడుదల చేసింది. గుల్జార్‌గా ప్రసిద్ధి చెందిన సంపూరణ్‌ సింగ్‌ కల్రా (89).. హిందీ సినిమాల్లో గీత రచయితగా, దర్శకుడిగా, స్క్రీన్‌ రైటర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పలు పుస్తకాలు కూడా రాశారు.

ప్రస్తుత తరంలో గొప్ప ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుపొందిన గుల్జార్‌.. 2002లో సాహిత్య అకాడమీ, 2013లో దాదాసాహెబ్‌ ఫాల్కే, 2004లో పద్మభూషణ్‌ అవార్డులు అందుకున్నారు. చలనచిత్ర రంగంలో ఐదు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. ’స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలోని జై హో.. పాటను గుల్జార్‌ రాయగా.. ఎ.ఆర్‌. రెహమాన్‌ స్వరపరిచారు. ఈ పాటకి ఉత్తమ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.

మరో పురస్కార గ్రహీత రామభద్రాచార్య (74) మధ్యప్రదేశ్‌ చిత్రకూట్‌లోని తులసీ పీఠం వ్యవస్థాపకుడు, పీఠాధిపతి. ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవాది, విద్యావేత్తగా పేరుపొందారు. ఆయన 240కి పైగా పుస్తకాలు రాశారు. 22 భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. అనేక భారతీయ భాషల్లో ఆయన తన రచనలు చేశారు. ఇక 2015లో పద్మవిభూషణ్‌ అవార్డు కూడా అందుకోవడం గమనార్హం.

జ్ఞానపీఠ్‌ అవార్డును 1944లో ఏర్పాటు చేశారు. భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ’జ్ఞానపీఠ్‌ అవార్డు’ను అందజేస్తారు. దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవంగా పరిగణిస్తారు. సంస్కృత భాషకు ఈ అవార్డును అందజేయడం ఇది రెండోసారి కాగా, ఉర్దూలో ఐదోసారి.

First Published:  18 Feb 2024 9:45 AM IST
Next Story