Telugu Global
National

గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు.. రాహుల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

గుజరాత్ హైకోర్ట్ తీర్పుపై ఇంకా కాంగ్రెస్ వర్గాలు స్పందించలేదు. వైరి వర్గాలు మాత్రం రాహుల్ కి పెద్ద షాక్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టాయి.

గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు.. రాహుల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?
X

పరువు నష్టం కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఊరట లభించలేదు. సూరత్‌ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హై కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో కాంగ్రెస్ కి పెద్ద షాక్ తగిలినట్టయింది.

2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలోని కోలార్ లో జరిగిన ర్యాలీలో మోదీ అనే ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సూరత్ కోర్ట్ లో పరువునష్టం కేసు వేశారు. ఆ కేసు విచారణ చాన్నాళ్లపాటు కొనసాగింది. చివరకు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ ని దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. జైలుశిక్ష ఖరారు కాగానే రాహుల్ ఎంపీ పదవికి కి అనర్హుడయ్యారు. వెంటనే ఆయనకిచ్చిన క్వార్టర్స్ ని కూడా వెనక్కి తీసేసుకుంది కేంద్రం. ఆ తర్వాత రాహుల్, సూరత్ కోర్టు తీర్పుని గుజరాత్ హైకోర్టులో సవాల్ చేశారు. గుజరాత్ హైకోర్టు మే 2న విచారణ పూర్తి చేసి తీర్పుని రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వెలువరించింది. ట్రయల్ కోర్ట్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

రాహుల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

గుజరాత్ హైకోర్ట్ తీర్పుపై ఇంకా కాంగ్రెస్ వర్గాలు స్పందించలేదు. వైరి వర్గాలు మాత్రం రాహుల్ కి పెద్ద షాక్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టాయి. అయితే ఈ తీర్పుని కాంగ్రెస్ సుప్రీంకోర్టులో సవాలు చేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. స్టేకు నిరాకరిస్తూ గుజరాత్ హైకోర్టు తీర్పునివ్వడంతో రాహుల్ కి ప్రత్యామ్నాయం ఏంటనేదానిపై చర్చ మొదలైంది. సర్వోన్నత న్యాయస్థానంలో ట్రయల్ కోర్ట్ తీర్పుని సవాల్ చేసేందుకు రాహుల్ కి అవకాశముందా లేదా అనేదానిపై న్యాయనిపుణులతో కాంగ్రెస్ వర్గాలు చర్చిస్తున్నాయి.

First Published:  7 July 2023 11:55 AM IST
Next Story