రెండు పార్టీలకు 'చీపురు' దెబ్బలు తప్పవా?
గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పులు తప్పేట్టు లేవు. రెండు పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీయే ప్రత్యామ్నాయమని ప్రజలు నమ్ముతున్నారు.
స్టోరీ హెడ్డింగ్ చూసి తప్పుగా అర్ధం చేసుకునేరు. హెడ్డింగులో చీపురంటే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుర్తని అర్ధం. ఈ సంవత్సరం ఆఖరులో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. పోటీ ఎప్పటిలాగే బీజేపీ-కాంగ్రెస్ మధ్యే అని మొదట్లో అనుకున్నా అనూహ్యంగా ఆప్ రేసులో దూసుకొచ్చేసింది. దాదాపు 27 ఏళ్ళుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ అంటే జనాల్లో వ్యతిరేకతైతే ఉందన్నది వాస్తవం.
అయితే ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పైన జనాల్లో పూర్తిగా నమ్మకం కలగటంలేదు. ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ అంటే జనాలకు వెగటు పుట్టేసింది. పైగా నాయకత్వం కొరత బాగా పీడిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే నాయకులమధ్య గొడవలు కదా. రెండున్నర దశాబ్దాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నా బీజేపీని ఓడించే విషయంలో నేతల మధ్య ఐకమత్యం కనబడటంలేదు. జనాలకు కూడా ప్రత్యామ్నయంలేకపోవటంతో బీజేపీనే దిక్కవుతోంది.
సరిగ్గా ఇలాంటి సమయంలోనే గుజరాత్ లోకి ఆప్ అడుగుపెట్టింది. 182 సభ్యులున్న అసెంబ్లీలో ఇపుడు బీజేపీకి 111, కాంగ్రెస్ కు 62 మంది ఎంఎల్ఏలున్నారు. మరికొన్ని చిన్నాచితకా పార్టీలు మిగిలిన సీట్లలో గెలిచాయి. అయితే ఆప్ ఎంట్రీతో రాబోయే ఎన్నికల్లో సీన్ మారబోతోందనే అనిపిస్తోంది. మెల్లిగా చీపురుపార్టీ జనాదరణలో పుంజుకుంటోంది. ఇప్పటికే కొన్ని మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లను గెలుచుకున్నది. సూరత్ కార్పొరేషన్ అయితే ఏకంగా ఆప్ చేతిలోనే ఉంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏడాదిగా ఢిల్లీ సీఎం, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో బాగా పర్యటిస్తున్నారు.
జనాలు కూడా ఆప్ ను ఆదరిస్తున్నట్లే ఉంది. ఎందుకంటే ఆప్ నిర్వహిస్తున్న సభలు, రోడ్డుషోలు, సమావేశాలకు జనాలు బాగా అటెండ్ అవుతున్నారు. వివిధ వర్గాల్లోని ప్రముఖులతోను సామాజికవర్గాల సంఘాలతో కేజ్రీవాల్ నిర్వహిస్తున్న భేటీలు సక్సెస్ అవుతున్నాయి. ఇంతకాలం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న జనాలకు ఆప్ రూపంలో ఆ కొరత తీరేట్లే ఉంది. అర్జంటుగా ఈ ఎన్నికల్లోనే ఆప్ అధికారంలోకి వచ్చేస్తుందని అనుకోవటంలేదు. అయితే బీజేపీ, కాంగ్రెస్ కు ఆప్ దెబ్బ గట్టిగా తగలటం మాత్రం ఖాయమని అర్ధమవుతోంది.