Telugu Global
National

డ్రగ్స్, నకిలీ కరెన్సీ.. కేరాఫ్ అడ్డా గుజరాత్ పోర్ట్

గుజరాత్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడకపోయినా పర్లేదు, కనీసం అక్రమాల విషయంలో ఫస్ట్ ప్లేస్‌కి దూరంగా జరిగితే మంచిది.

డ్రగ్స్, నకిలీ కరెన్సీ.. కేరాఫ్ అడ్డా గుజరాత్ పోర్ట్
X

గుజరాత్.. భారత్‌లో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న ఓ రాష్ట్రం. తరచూ ఈ రాష్ట్రం వార్తల్లోకెక్కుతోంది. అభివృద్ధిలో కాదు, అక్రమ రవాణాలో.. అవును గుజరాత్ స్మగ్లింగ్ వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. మరి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు..? ఏం చర్యలు తీసుకుంటున్నట్టు..? ముంద్రా పోర్ట్ అదానీ పరం అయిన తర్వాత ఈ వ్యవహారాలు మరింతగా పెరిగాయి. పోర్టులను ప్రైవేటుపరం చేస్తూ పెట్టుబడుల ఉపసంహరణతో ప్రభుత్వం ఎంత పెద్ద తప్పు చేస్తోందో చెప్పడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ప్రైవేటు నిర్వహణలో ఉన్న పోర్టుల్లో సెక్యూరిటీ ఎవరికి అనుకూలంగా ఉంటుంది. డబ్బులతో ఎలాంటిపనులైనా అక్కడ జరిగిపోతాయి. కానీ అక్కడక్కడా కొన్ని ప్రభుత్వ సంస్థలు నిజాయితీగా పనిచేయబట్టి పోర్టుల నుంచి బయటకొస్తున్న డ్రగ్స్, నకిలీ కరెన్సీ.. జనంలోకి రాకుండా అడ్డుకట్టపడుతోంది. తాజాగా గుజరాత్ లో 317 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ పట్టుబడటం సంచలనంగా మారింది. ఈ నకిలీ కరన్సీ ఓడరేవు ద్వారానే భారత్‌లో ప్రవేశించింది.

ఇటీవల సూరత్ జిల్లాలో ఓ అంబులెన్స్ లో దాచి ఉంచిన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్ల కేసులో ప్రధాన సూత్రధారి వికాస్ జైన్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీఆర్ఎల్ లాజిస్టిక్స్ పేరుతో పోర్ట్ నుంచి సరకుల రవాణా చేసే వ్యాపారం వికాస్‌కు ఉంది. దీన్ని అడ్డు పెట్టుకుని ఇతను దేశంలోకి నకిలీ నోట్లను తీసుకొస్తున్నాడు. దొరికింది రూ.317 కోట్లే, ఇప్పటి వరకూ దొర్కకుండా భారత్‌లోకి వచ్చేసిన నకిలీ కరెన్సీ విలువ ఎంత ఉంటుందో అంచనా వేయలేం.

ఇక డ్రగ్స్ విషయంలో గుజరాత్ పోర్ట్ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. డ్రగ్స్ రవాణాకు గుజరాత్ బాగా కలిసొస్తుందనే నమ్మకం స్మగ్లర్లకు కలిగింది. అందుకే వారు గుజరాత్‌నే రవాణాకు ఎంపిక చేసుకున్నారు. ఏడాది కాలంలో గుజరాత్ ఓడరేవుల ద్వారా 23వేల కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను రవాణా కాకుండా డీఆర్ఐ అధికారులు అడ్డుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. అంటే పోలీసుల కళ్లుగప్పి ఇంకెంత బయటకెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

అభివృద్ధి కాదు, అక్రమాలను అడ్డుకోండి..

గుజరాత్‌లో ఉన్న బీజేపీ ప్రభుత్వం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడకపోయినా పర్లేదు, కనీసం అక్రమాల విషయంలో ఫస్ట్ ప్లేస్‌కి దూరంగా జరిగితే మంచిది. ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే డ్రగ్స్, నకిలీ కరెన్సీలకు అడ్డుకట్ట వేయకపోతే, అది కేవలం గుజరాత్‌కే కాదు, భారత్‌కే పెద్ద ప్రమాదం.

First Published:  6 Oct 2022 12:05 PM IST
Next Story