Telugu Global
National

కోటీశ్వరులు, నేరచరితులు.. గుజరాత్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇది

అందరూ కోటీశ్వరులే అయినా, అందులో అత్యంత పెద్ద కోటీశ్వరుడు బీజేపీ ఎమ్మెల్యే జెఎస్ పటేల్. ఆయన ఆస్తుల విలువ రూ.661కోట్లు.

కోటీశ్వరులు, నేరచరితులు.. గుజరాత్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇది
X

గుజరాత్ లో బీజేపీ నాన్ స్టాప్ పాలనలో ఎంతమంది సామాన్యుల ఆర్థిక పరిస్థితి మెరుగైందో తెలియదు కానీ, రాజకీయ నాయకులు మాత్రం కోటీశ్వరులవుతున్నారు. గుజరాత్ ఎన్నికలతో ఈ విషయం మరోసారి నిరూపితమైంది. గతంలో గుజరాత్ శాసన సభలో 60శాతం మంది కోటీశ్వరులుండగా.. తాజా ఎన్నికల తర్వాత కోటీశ్వరులైన ఎమ్మెల్యేలు 83శాతానికి పెరిగారు. 182 మంది ఎమ్మెల్యేలలో 151 మంది కోటీశ్వరులే కావడం విశేషం.

గరిష్ట ఆస్తి రూ.661 కోట్లు

అందరూ కోటీశ్వరులే అయినా, అందులో అత్యంత పెద్ద కోటీశ్వరుడు బీజేపీ ఎమ్మెల్యే జెఎస్ పటేల్. ఆయన ఆస్తుల విలువ రూ.661కోట్లు. ఆ తర్వాత బల్వంత్ సిన్హ్ రాజ్ పుత్ 372కోట్ల ఆస్తితో రెండో స్థానంలో ఉన్నారు. ఇవన్నీ పేపర్ పై కనిపించే లెక్కలే. నల్ల ధనం, లెక్కల్లో చూపించని ఆస్తి ఇంకా చాలానే ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలలో 132మంది కోటీశ్వరులు కాగా, కాంగ్రెస్ లో 14మంది, ఆమ్ ఆద్మీ, సమాజ్ వాదీ పార్టీల్లో ఒక్కొకరు కోటీశ్వరులున్నారు. ఇక గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులూ కోటీశ్వరులే కావడం విశేషం. శాసనసభ్యుల అఫిడవిట్ లను పరిశీలించి, విశ్లేషించి అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) ఈ విషయాలు వెల్లడించింది.

నేరచరితులు ఎంతమందంటే..?

ఇక గుజరాత్ ఎమ్మెల్యేలలో 16శాతం మంది నేరచరితులు. 29మంది ఎమ్మెల్యేలు.. హత్య, అత్యాచారం వంటి తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ 29లో 20 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్‌, ఇద్దరు ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఇద్దరు స్వతంత్రులు కాగా ఒకరు సమాజ్‌ వాదీ పార్టీకి చెందిన వారు. కొత్తగా గెలిచినవారిలో మహిళలకు వ్యతిరేకంగా తీవ్ర నేరాలు చేసి అభియోగాలను ఎదుర్కొంటున్నవారు ముగ్గురు. ఇందులో బీజేపీకి చెందినవారు ఇద్దరు. వీరిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

First Published:  12 Dec 2022 3:42 AM GMT
Next Story