Telugu Global
National

గుజరాత్‌ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఫైర్‌

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఆదేశాలిచ్చిన నాలుగేళ్ల తర్వాత కూడా.. ఇలా జరగడం ఇది ఆరోసారని గుర్తుచేసింది.

గుజరాత్‌ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఫైర్‌
X

గుజరాత్‌ ప్రభుత్వ తీరుపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. రాజ్‌కోట్‌ వీడియో గేమ్‌ జోన్‌ అగ్నిప్రమాద ఘటనలో 28 మంది ఆహుతైన ఉదంతంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరును చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతున్న రాష్ట్ర యంత్రాంగంపై తమకు విశ్వాసం లేదని స్పష్టం చేసింది.

ఈ అగ్నిప్రమాదం కేసుపై సోమవారం విచారణ చేపట్టిన గుజరాత్‌ హైకోర్టు రాజ్‌కోట్‌ మున్సిపల్‌ అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. మీ పరిధిలో ఇంతటి భవనం ఉందని మీకు తెలియదా? కళ్లు మూసుకున్నారా? ఫైర్‌ సేఫ్టీ లేకుండా రెండున్నరేళ్లుగా ఇది ఉందని ఎలా చెబుతారు? టికెట్‌ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా? అంటూ వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్‌ బైరెన్‌ వైష్ణవ్, జస్టిస్‌ దేవాన్‌ దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం.. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కూడా పాల్గొన్నట్టు ప్రచురించిన మీడియా కథనాలను కూడా ఈ సందర్భంగా చూపించింది. ఆ అధికారులు ఎవరు? వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా? అంటూ ధర్మాసనం నిలదీసింది.

ప్రమాదం జరిగిన గేమ్‌ జోన్‌ను 2021లో ఏర్పాటుచేశారని, అప్పటి నుంచి ఈ ప్రమాదం జరిగినంతవరకు రాజ్‌కోట్‌ కమిషనర్లుగా పనిచేసినవారంతా ఈ విషాదానికి బాధ్యత వహించాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. వారంతా వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈ సందర్భంగా ఆదేశించింది. అనుమతుల కోసం టీఆర్పీ గేమ్‌ జోన్‌ తమను సంప్రదించలేదంటూ ఆర్‌ఎంసీ తరపు న్యాయవాది వివరించే సమయంలో హైకోర్టు ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తాము ఆదేశాలిచ్చిన నాలుగేళ్ల తర్వాత కూడా.. ఇలా జరగడం ఇది ఆరోసారని గుర్తుచేసింది. ప్రాణాలు కోల్పోవడాన్నే వాళ్లు కోరుకుంటారని, ఆ తర్వాత యంత్రాంగాన్ని పురమాయిస్తారని మండిపడింది. ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి ఓ పిల్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చేశారని ఈ సందర్భంగా నిలదీసింది. నెలలుగా కార్పొరేషన్‌ ఏం చేస్తోందని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

హైకోర్టు ఆగ్రహంతో ఆఘమేఘాలపై చర్యలు...

రాజ్‌కోట్‌ అగ్నిప్రమాద ఘటనలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాజ్‌కోట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ చీఫ్‌ ఆనంద్‌ పటేల్, స్థానిక పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవతో పాటు ఏసీపీ విధి చౌధరీ, డీసీపీ సుధీరకుమార్‌ దేశాయిపై బదిలీ వేటు వేసింది.

First Published:  28 May 2024 8:14 AM IST
Next Story