Telugu Global
National

ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే గుజరాత్ 'ఆప్' ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతారా ?

ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎన్నికల ముందు దాకా కాషాయ పార్టీ నాయకులే. బీజేపీ టిక్కెట్లు నిరాకరించడంతో వారు బీజేపీని వీడి ఆప్‌లో చేరారు.ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన ఐదుగురిలో ఒకరైన భూపత్ భయానీ ఆప్‌కి రాజీనామా చేసి అధికారికంగా బీజేపీలో చేరాలని భావిస్తున్నారు.

ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే గుజరాత్ ఆప్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోతారా ?
X

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా అవతరింపజేశాయి. కానీ ఆ ఆనందం కేజ్రీవాల్ కు ఎక్కువ రోజులు నిలిచేట్టుగా లేదు.గుజరాత్ లో ఆప్ తరపున గెలిచిన 5గురు ఎమ్మెల్యేలు బీజేపీ చేరబోతున్నారని సమాచారం.

ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎన్నికల ముందు దాకా కాషాయ పార్టీ నాయకులే. బీజేపీ టిక్కెట్లు నిరాకరించడంతో వారు బీజేపీని వీడి ఆప్‌లో చేరారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన ఐదుగురిలో ఒకరైన భూపత్ భయానీ ఆప్‌కి రాజీనామా చేసి అధికారికంగా బీజేపీలో చేరాలని భావిస్తున్నారు. అదేరోజు ఆయన విలేకరుల సమావేశంలో ప్రసంగించే అవకాశం ఉంది.

ఆప్ తరపున గెలిచిన చైతర్ వాసవ, భూపత్ భయానీ,హేమంత్ ఖవా, ఉమేష్ మకవానా, సుధీర్ వఘానిలు ప్రస్తుతం బీజేపీ నాయకుల టచ్ లో ఉన్నట్టు బీజేపీ వర్గాల సమాచారం.

ఆప్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన ముగ్గురు మాజీ బీజేపీ నాయకులు ఫలితాలు వెలువడ్డ రోజే బీజేపీ టచ్ లోకి వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మిగతా ఇద్దరిని కూడా కూడగట్టుకొని మొత్తం శాసనసభాపక్షమే బీజేపీలో విలీనం కానుంది.

అయితే ఈ విషయంపై ఓ ప్రైవేట్ ఛానల్ తో మాట్లాడిన అప్ ఎమ్మెల్యే భూపత్ భయానీ, "నేను బిజెపిలో చేరలేదు. బిజెపిలో చేరాలా వద్దా అని నేను ప్రజలను అడుగుతాను" అని అన్నారు.

"గుజరాత్ ప్రజలు నరేంద్ర మోడీకి, బిజెపికి రికార్డు గెలుపును ఇచ్చారు. నేను దానిని గౌరవిస్తాను... నేను ఇంతకుముందు బిజెపిలో ఉన్నాను. నాకు ఆ పార్టీ నాయకులతో మంచి సంబంధాలున్నాయి." అన్నారు.

"నా సీటు రైతుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఉంది. వారి నీటిపారుదల సంబంధిత సమస్యలను నేను పరిష్కరించాలి. ఆ ప్రాంతంలో చాలా మంది వ్యాపారులు కూడా ఉన్నారు. నేను వారిని కూడా చూసుకోవాలి. ప్రభుత్వంతో నాకు సత్సంబంధాలు లేకుంటే నేను ఇవన్నీ చేయలేను. అందుకే నేను ప్రజల ముందు ఈ విషయాలన్నీ ఉంచాను. వారే నిర్ణయిస్తారు.'' అని అన్నారాయన.

ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చే అవకాశం గురించి అడిగినప్పుడు, భయానీ దానిని తోసిపుచ్చారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజల కోసం పని చేయడం తన‌ హక్కు అని ఆయన అన్నారు.

మొత్తానికి గుజరాత్ లో జరుగుతున్న పరిణామాలు కేజ్రీవాల్ కు మింగుడు పడటం లేదు. 5 సీట్లు గెలిచి 13 శాతం ఓట్లు సంపాదించిన ఆనందం కొద్ది రోజులు కూడా ఉండేట్టు లేదు.

First Published:  11 Dec 2022 6:21 PM IST
Next Story