Telugu Global
National

బీజేపీని వీడిన మోదీ మంత్రి వర్గ సహచరుడు..

మోదీ మంత్రి వర్గంలో పనిచేసిన సీనియర్ నేత నారాయణ్ వ్యాస్ పార్టీని వీడారంటే దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటున్నారు. అయితే కాంగ్రెస్ నుంచా లేక ఆప్ నుంచా అనేది తేలాల్సి ఉంది.

బీజేపీని వీడిన మోదీ మంత్రి వర్గ సహచరుడు..
X

అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు, ఏడుసార్లు సిద్ధపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి నాలుగుసార్లు గెలుపొందిన నాయకుడు.. ఇప్పుడు బీజేపీని వీడారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇది బీజేపీకి పెద్ద షాకింగ్ న్యూసే అని చెప్పాలి. అయితే ఆయన్ను వయోభారం రీత్యా బీజేపీ పక్కనపెట్టిందని అంటున్నారు. కాదు కాదు తానే బయటకొచ్చేశానని చెబుతున్నారు మాజీ మంత్రి నారాయణ్ వ్యాస్. ఆయన పార్టీకి దూరం కావడం వల్ల వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎంతమేర నష్టం జరుగుతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అన్నీ అపశకునాలే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ బీజేపీకి వరుసగా అపశకునాలు ఎదురవుతున్నాయి. సంప్రదాయ శత్రువు కాంగ్రెస్ ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్న కమలనాథులకు, పంజాబ్ లో అధికారాన్ని చేజిక్కించుకొని షాకిచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చుక్కలు చూపెడుతోంది. ఉచిత హామీలతో ఆప్ అక్కడ దూసుకెళ్తోంది. ఈలోగా మోర్బీ వంతెన దుర్ఘటన బీజేపీని కోలుకోలేని దెబ్బతీసింది. పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమాదంలో 135మంది మరణించడం, తదనంతరం జరిగి పరిణామాలు గుజరాత్ లో బీజేపీ పరువు తీసేశాయి. పరామర్శకు ప్రధాని మోదీ రాక సందర్భంగా ఆస్పత్రిలో అప్పటికప్పుడు టైల్స్ వేయడం, రంగులు మార్చడం, రోడ్డు పక్కన పరదాలు కట్టడం వంటి జిమ్మిక్కులు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ డొల్లతనాన్ని బయటపెట్టాయి.

పెట్రోల్, గ్యాస్ రేట్ల పెరుగుదల, పెరిగిన నిరుద్యోగం, రూపాయి బలహీన పడటం.. వంటి వైఫల్యాలు ఎలాగూ బీజేపీని వెంటాడుతున్నాయి. వీటినుంచి బయటపడటం ఎలా అని ఆలోచిస్తున్న ఆ పార్టీకి ఇప్పుడు సీనియర్లు షాకిస్తున్నారు. మోదీ మంత్రి వర్గంలో పనిచేసిన సీనియర్ నేత నారాయణ్ వ్యాస్ పార్టీని వీడారంటే దాని ప్రభావం ఏమేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానంటున్నారు. అయితే కాంగ్రెస్ నుంచా లేక ఆప్ నుంచా ఆనేది తేలాల్సి ఉంది.

First Published:  5 Nov 2022 5:12 PM IST
Next Story