Telugu Global
National

బీజేపీ వాహనాన్ని బైటికి లాగిన కాంగ్రెస్ వాహనం..ఇది ఆ రెండు పార్టీల' ILU-ILU' అన్న కేజ్రీవాల్

ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన బీజేపీ ప్రచారం రథం ఇసుకలో కూరుక పోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా దాన్ని బైటి లాగలేకపోయాడు. ఇంతలో అటు వైపు కాంగ్రెస్ ప్రచార రథం వచ్చింది. ఆ కాంగ్రెస్ డ్రైవర్ కు బీజేపీ డ్రైవర్ తన కష్టాన్ని చెప్పుకున్నాడు.

బీజేపీ వాహనాన్ని బైటికి లాగిన కాంగ్రెస్ వాహనం..ఇది ఆ రెండు పార్టీల ILU-ILU అన్న కేజ్రీవాల్
X

ప్రతి దాంట్లో రాజకీయాలుంటాయన్నది నిజమే కానీ ఓ ఇద్దరు శ్రామికులు ఒకరికొకరు సహాయం చేసుకున్నా దానికీ రాజకీయాలకు లింక్ చేయడమన్నది మాత్రం రాజకీయ నాయకులు తప్ప ఇతర మానవమాత్రుడెవరూ చేయలేరు.

వచ్చే నెలలో గుజరాత్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పక్షాల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లకు తోడు ఈ సారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలోకి ఎంటరయ్యింది. హోరెత్తుతున్న ప్రచారం, నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్యలో ఓ సంఘటన జరిగింది. నిజానికి అది మామూలు రోజుల్లో అయితే పెద్ద ప్రాధాన్యత లేని సంఘటనే కానీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాక రాజకీయ నాయకుల ఆరోపణలకు కూడా నెలవయ్యింది.

ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్ళిన బీజేపీ ప్రచారం రథం ఇసుకలో కూరుక పోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా దాన్ని బైటి లాగలేకపోయాడు. ఇంతలో అటు వైపు కాంగ్రెస్ ప్రచార రథం వచ్చింది. ఆ కాంగ్రెస్ డ్రైవర్ కు బీజేపీ డ్రైవర్ తన కష్టాన్ని చెప్పుకున్నాడు. తోటి వారికి సహాయం చేయడం తప్ప ఏ రాజకీయాలు లేని, రోజు కూలీకి పని చేసే ఆ డ్రైవర్లు ఒకరికొకరు తోడయ్యారు. కాంగ్రెస్ వాహనం సహాయంతో బీజేపీ వాహనాన్ని బైటికి లాగారు. దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అది చూసిన‌ వెంటనే 'ఆప్' అధ్యక్షుడు కేజ్రీవాల్ రంగంలోకి దిగాడు. చూశారా ! బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం అంటూ రాగం మొదలు పెట్టాడు. తనను ఓడించడానికి రెండు పార్టీలు లవ్ చేసుకుంటున్నాయంటూ పల్లవి అందుకున్నాడు.

ట్విట్టర్ లో ఆ వీడియోను షేర్ చేసిన కేజ్రీవాల్, "గుజరాత్‌లో నిలిచిపోయిన బిజెపి ఎన్నికల వాహనాన్ని రక్షించడానికి కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది." "ఎన్నికలలో ఇది BJP, కాంగ్రెస్ యొక్క ILU-ILU యొక్క కథ" అని కామెంట్ చేశారు .(ILU-ILU అంటే 1991 లో రిలీజైన చిత్రం 'సౌదాగర్'లోని "ఐ లవ్ యు" పాట).


కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజనులు తీవ్రంగానే స్పంధించారు. ''ఇది కేవలం 200 రూపాయల రోజు కూలీకి పనిచేసే ఒక కార్మికుడు మరొకరికి చేసిన సహాయం మాత్రమే. మేము ప్రతిచోటా ఓట్లను చూడలేము. మానవత్వాన్ని మాత్రమే చూస్తాము" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

"గుజరాత్‌లో విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న‌ కాంగ్రెస్-ఆప్ ప్రయోగం బీజేపీ విజయంతో ముగుస్తుంది. ఆ తర్వాత హర్యానాలో పొత్తు ఉంటుంది. కానీ అక్కడా ఓడిపోతారు" అని మరో నెటిజన్ అన్నారు.

మరో వైపు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం , ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో వరుసగా 27 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, అంతకు ముందు అనేక పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో కేవలం 'ఫ్రెండ్లీ మ్యాచ్‌లు' మాత్రమే ఆడుతోందని ఆరోపిస్తోంది.

గుజరాత్ లో డిసెంబరు 1, 5 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు హిమాచల్ ప్రదేశ్‌తో పాటు డిసెంబర్ 8న వెలువడనున్నాయి.

First Published:  13 Nov 2022 1:56 PM IST
Next Story