Telugu Global
National

కర్నాటకలో ‘గృహలక్ష్మి’ వర్సెస్ ‘గృహిణి శక్తి’

బీజేపీ ప్రకటించిన పథకం పేరు గృహిణి శక్తి. ఈ పథకంలో కూడా మహిళలకు 2వేల రూపాయల తాయిలం ప్రకటించారు సీఎం బసవరాజ్ బొమ్మై.

కర్నాటకలో ‘గృహలక్ష్మి’ వర్సెస్ ‘గృహిణి శక్తి’
X

దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు నగారా మోగింది. వాటితోపాటు ఈ ఏడాదే ఎన్నికలు జరగాల్సిన మరో రాష్ట్రం కర్నాటక. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందే అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోటాపోటీగా ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాయి పార్టీలు. అధికార బీజేపీ, జోడో యాత్రతో ఊపుమీదున్న కాంగ్రెస్.. రెండూ కర్నాటకపై ఫోకస్ పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నగదు బదిలీ పథకాలతో సిద్ధమైపోయాయి కాంగ్రెస్, బీజేపీ.

మహిళకు 2వేలు..

ఆకర్షణీయ పథకాల ప్రకటనలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబంలోని మహిళా యజమాని ఖాతాలో 2వేల రూపాయలు జమ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రియాంక గాంధీతో ఈ ప్రకటన చేయించారు కర్నాటక కాంగ్రెస్ నేతలు. దీనికి గృహలక్ష్మి అనే పేరు ఖరారు చేశారు. ఈ పథకం ప్రకటించిన వెంటనే బీజేపీ రియాక్ట్ అయింది. అలాంటి పథకాలు ఆచరణ సాధ్యం కావని అన్నారు కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై. ఓటర్లకు తాయిలాలతో గేలం వేయలేరని చెప్పారాయన. కట్ చేస్తే వారం రోజుల్లోనే బీజేపీ కూడా అలాంటి పథకాన్నే ప్రకటించింది. కాకపోతే పేరు మార్చింది అంతే.

గృహలక్ష్మికి పోటీగా గృహిణి శక్తి..

బీజేపీ ప్రకటించిన పథకం పేరు గృహిణి శక్తి. ఈ పథకంలో కూడా మహిళలకు 2వేల రూపాయల తాయిలం ప్రకటించారు సీఎం బసవరాజ్ బొమ్మై. దారిద్ర రేఖకు దిగువన ఉన్న ఒక్కో కుటుంబానికి నెలకు 2వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారాయన. అసోంలో ఇప్పటికే అమలవుతున్న ఈ తరహా పథకాన్ని అధ్యయనం చేసి, కర్నాటకలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే దీన్ని అమలు చేస్తారా లేక మరోసారి కర్నాటక ప్రజలు అధికారాన్ని అప్పగించిన తర్వాత అమలు చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

మొత్తమ్మీద కర్నాటకలో అధికార బీజేపీలో గుబులు మొదలైంది. ఇప్పటికే కాంట్రాక్టర్ల ఘోష ఆ పార్టీకి తగిలేలా ఉంది. ప్రతి దాంట్లో కమిషన్లు అడుగుతున్నారని.. మంత్రులు, ఎమ్మెల్యేలకు ముడుపులు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నామని ఆరోపిస్తున్నారు కాంట్రాక్టర్లు. సామాన్యులు కూడా ఈ కమీషన్ల గోలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ దశలో 2వేల రూపాయల గృహిణి శక్తి పథకాన్ని ప్రకటించి ఓటర్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తోంది బీజేపీ.

First Published:  19 Jan 2023 5:10 AM GMT
Next Story