అవసరమైన ఔషధాల లిస్ట్ నుంచి 26 మందులు తొలగింపు
దేశంలో అవసరమైన మందుల జాబితానుంచి కేంద్ర ప్రభుత్వం 26 మందులను తొలగించింది. 34 మందులను కొత్తగా చేర్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ రోజు జాబితా విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 384 అవసరమైన మందులు, 1,000 ఫార్ములేషన్‌లతో కూడిన నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM)2022 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దేశంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే కొన్ని మందులు ఉన్నాయి.
ఈ జాబితాలోని మందులనుషెడ్యూల్డ్ డ్రగ్స్ అని కూడా పిలుస్తారు, ఈ మందులను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు ఉచితంగా అందిస్తారని ఈ జాబితాను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
ఈ రోజు విడుదల చేసిన జాబితాలో ఐవర్ మెక్టిన్, అమికాసిన్, డెలామానిడ్, ఇట్రాకొనాజోల్ ఎబిసి డొలుటెగ్రావిర్, బెడాక్విలిన్, మెరోపెనెమ్, సెఫురోక్సిమ్, మాంటెలుకాస్ట్, లాటానోప్రోస్ట్, ప్లూడ్రోకార్టిసాన్, ఇన్సులిన్ గ్లార్జిన్, ఓర్కెలోక్సిఫశ్రీన్, యాంటీ బయాటిక్ మందులు, క్యాన్సర్ చికిత్స మందులతో సహా మొత్తం 34 మందులను కొత్తగా చేర్చారు.
అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలకు వాడే రానిటిడైన్, జింటాక్, రాంటాక్ మందులు, అటెనోలోల్, వైట్ పెట్రోలేటమ్, సుక్రాల్ఫేట్, మిథైల్ డోపా వంటి మందులతో సహా మొత్తం 26 మందులను అవసరమైన మందుల జాబితానుంచి తొలగించారు.
రానిటిడైన్, జింటాక్, రాంటాక్ మందుల్లో క్యాన్సర్ కారక ఎన్ నైట్రోసోడిమిథైలమిన్ ఉన్నందువల్ల వాటిని తొలగించినట్టు తెలుస్తోంది.