విమాన టికెట్ల రేట్లలో భారీగా మార్పులు
కొవిడ్ తర్వాత 2020లో విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన సందర్భంలో కనిష్ట, గరిష్ట ధరలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా రేట్లు పెంచి ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
దేశీయ విమాన సర్వీసుల టికెట్ రేట్లపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. ఈ నిర్ణయం ఆగస్ట్ 31 నుంచి అమలులోకి వస్తుంది. ఇకపై ప్రయాణికుల చార్జీలను విమానయాన సంస్థలే స్వేచ్ఛగా నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది కేంద్రం. గతంలో కూడా విమానయాన సంస్థలే టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకునేవి. అయితే కొవిడ్ తర్వాత 2020లో విమానయాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన సందర్భంలో కనిష్ట, గరిష్ట ధరలపై ప్రభుత్వం పరిమితులు విధించింది. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా రేట్లు పెంచి ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడీ పరిమితుల్ని ఎత్తివేసింది.
ధరలు పెరుగుతాయా..? తగ్గుతాయా..?
కొంతకాలంగా విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2019-20 లో ఏటీఎఫ్ ధర కిలో లీటరు రూ. 53,000 కాగా, ప్రస్తుతం లక్షా 20 వేల రూపాయలకు చేరింది. దీంతో విమాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం పరిమితి ఎత్తివేయడంతో చార్జీలు భారీగా పెరిగే అవకాశముంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. విమానయాన సంస్థల్లో పోటీ ఎక్కువగా ఉంది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోడానికి ఆయా సంస్థలు భారీగా డిస్కౌంట్లు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే విమానయాన సంస్థలు మరి కొన్నాళ్లు నష్టాలను భరించడానికి సిద్ధమైనట్టే. డిస్కౌంట్లతో ప్రయాణికులను ఒడిసిపట్టుకోవాలని నిర్ణయిస్తే మాత్రం అంతిమంగా రేట్లు తగ్గుతాయి.
విమాన రంగం వృద్ధికి అవకాశాలు..
కొవిడ్ తర్వాత పౌర విమానయాన రంగంలో స్థిరీకరణ మొదలైందని కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో దేశీయంగా విమాన రంగం మరింత వృద్ధి సాధించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే విమాన రంగం కోలుకుంటోంది, ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. పరిమితి ఎత్తివేయడంతో విమానయాన సంస్థలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.