ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు.. క్లారిటీ ఇచ్చిన ఈసీ
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయకుండా నిషేధం విధించారంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ నకిలీదని ఈసీ తేల్చిచెప్పింది.
ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర భద్రతాదళాల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును ముందుగానే వేస్తారు. ఎన్నికల విధుల్లో ఉన్నందుకు ఎన్నికల సంఘం వారికి కల్పించిన వెసులుబాటు అది. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వోద్యోగులు ఓటేయకుండా ఈసీ నిషేధం విధించిందంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ఫేక్ అంటూ ఈసీ ఎక్స్ (ట్విట్టర్)లో క్లారిటీ ఇచ్చింది.
నకిలీ సందేశం.. పట్టించుకోవద్దు
ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయకుండా నిషేధం విధించారంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ నకిలీదని ఈసీ తేల్చిచెప్పింది. అలాంటి నకిలీ సందేశాలను నమ్మవద్దని సూచించింది. వాటిని వైరల్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తుందని ఈసీ స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో తలమునకలయ్యే ఉద్యోగులకు ఈసీ కల్పించిన ఆ వెసులుబాటును తొలగించే ప్రసక్తే లేదని చెప్పడంతో ఈ వైరల్ మెసేజ్‌పై ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు ఊరట లభించింది.