Telugu Global
National

మతం, కులం లేని వాళ్ళకు కూడా ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించాల్సిందే - కేరళ హైకోర్టు

కేరళ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మతము, కులము లేని వాళ్ళకు కూడా ప్రభుత్వ ప్రయోజనాలు అందించడానికి ఒక విధానాన్ని, మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) వచ్చే ప్రయోజనాలను పొందేందుకు వీలుగా వారికి కూడా సర్టిఫికెట్ జారీ చేయాలని కోర్టు తీర్పునిచ్చింది.

మతం, కులం లేని వాళ్ళకు కూడా ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించాల్సిందే - కేరళ హైకోర్టు
X

మతం , కులం లేనంత మాత్రాన ప్రభుత్వ ఇచ్చే ప్రయోజనాలను ఇవ్వకపోవడం సరైంది కాదని వారికి కూడా ప్రభుత్వ ప్రయోజనాలను అందించాలని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

"ప్రగతిశీలిగా చెప్పుకునే ప్రభుత్వం ఏ కమ్యూనిటీకి చెందని పౌరులకు ప్రయోజనాలను తిరస్కరించకూడదు." అని కోర్టు పేర్కొంది, తమను తాము ఏ మతానికి, కులానికి చెందని వారుగా ప్రకటించుకున్న వ్యక్తులకు కమ్యూనిటీ సర్టిఫికేట్లు జారీ చేయడానికి ఒక విధానాన్ని, మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) వచ్చే ప్రయోజనాలను పొందేందుకు వీలుగా సర్టిఫికెట్ జారీ కోసం ఆదేశించాలని కోరుతూ, తాము మతం లేని వర్గానికి చెందినవారమని ప్రకటించిన 12 మంది విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఫార్వర్డ్ కమ్యూనిటీ కమిషన్ సిఫారసుల ఆధారంగా రాష్ట్రం జాబితాను విడుదల చేసిందని, అయితే అందులో కులం, మతాన్ని ప్రకటించిన వ్యక్తులను మాత్రమే చేర్చారని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. మతం లేని విద్యార్థులను EWSలో చేర్చలేదని లాయర్ వాదించారు.

ప్రభుత్వ లాయర్ వాదనలను అసంబద్దమైనవిగా కొట్టిపడేసిన కోర్టు SC, ST, OBC కాకుండా ఇతర వర్గాల EWS విద్యార్థులకు అందుబాటులో ఉన్న 10% రిజర్వేషన్ మత రహిత వారికి కూడా అందించాలని, అందుకోసం వారు కోరుతున్నట్టు మత రహిత కేటగిరీ కింద విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

"వారు EWS నుండి వచ్చినట్లయితే, ఆర్టికల్ 15 (6) క్రింద హామీ ఇవ్వబడిన ప్రయోజనాలను పొందడానికి వీలు కల్పించే సర్టిఫికేట్ లు పొందడానికి వారు అర్హులు. ఒక నిర్దిష్ట మతం, కులంలో పుట్టినందున వారు ఎటువంటి ప్రయోజనాన్ని కోరుకోవడం లేదు, "అని కోర్టు పేర్కొంది.

ఆదాయంలో అసమానతలను తగ్గించడానికి రాష్ట్రం కృషి చేయాలని, వ్యక్తుల మధ్య హోదా, అవకాశాలలో అసమానతలను తొలగించడానికి ప్రయత్నించాలని పేర్కొంది. "ఇటువంటి ప్రయత్నాలు కులం, మతాలకు పరిమితం కాకూడదు" అని కోర్టు పేర్కొంది.

First Published:  13 Aug 2022 7:36 PM IST
Next Story