సుందర్ పిచాయ్‌కి పద్మభూషణ్ అవార్డు అందజేత.. - జనవరిలో ప్రకటన.. తాజాగా ప్రదానం
సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. ఈ అపారమైన గౌరవం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను భారత్ ప్రకటించగా, వాణిజ్య, పరిశ్రమల విభాగంలో సుందర్ పిచాయ్‌ని పద్మభూషణ్ అవార్డు వరించింది. ఈ పురస్కారాన్ని శుక్రవారం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిచాయ్‌తో పాటు భారత కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ ఉన్నారు.
ఈ సందర్భంగా సుందర్ పిచాయ్ స్పందిస్తూ.. ఈ అపారమైన గౌరవం కల్పించిన భారత ప్రభుత్వానికి, ప్రజలకు తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తనను తీర్చిదిద్దిన దేశం నుంచి ఈ గౌరవం పొందడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. భారత్ తనలో భాగమని, తాను ఎక్కడికెళ్లినా ఈ వారసత్వాన్ని తనతో తీసుకెళతానని ఆయన వెల్లడించారు.
గూగల్, భారత్ మధ్య గొప్ప భాగస్వామ్యాన్ని కొనసాగించేందుక తాను ఉత్సాహంగా ఉన్నట్టు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మన గడప వరకు చేరే ప్రతి సాంకేతికత మన జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆయన తెలిపారు. సాంకేతికపరంగా భారత్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయని, భారత్‌లో సృష్టించిన ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచానికి మేలు చేస్తున్నాయని సుందర్ పిచాయ్ ఈ సందర్భంగా కొనియాడారు.