బెంగాల్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 బోగీలు
రైల్వే సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా లూప్ లైన్ లోకి వెళ్లిన రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
దేశవ్యాప్తంగా రైళ్ల ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఈనెల 2వ తేదీన ఒడిశాలోని బాలసోర్‌లో మూడు రైళ్లు ఢీకొన్న సంఘటనలో 292 మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత కూడా పలు రాష్ట్రాల్లో వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం పశ్చిమ బెంగాల్‌లో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం కారణంగా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఓ లోకో పైలెట్ కి గాయాలయ్యాయి.
రైల్వే అధికారులు తెలిపిన సమాచారం మేరకు.. బంకురా జిల్లా ఓండా స్టేషన్‌కు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఖాళీగా వస్తున్న రెండు గూడ్స్ రైళ్లు పరస్పరం ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన ధాటికి ఓ గూడ్స్ రైలు ఇంజిన్ మరో బోగీపైకి ఎక్కింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. ట్రాక్ మొత్తం ధ్వంసమైంది. ప్రమాదం కారణంగా గూడ్స్ రైలు లోకో పైలెట్ కి గాయాలయ్యాయి.
రైల్వే సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా లూప్ లైన్ లోకి వెళ్లిన రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, రెండు గూడ్స్ రైళ్ల ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పశ్చిమ బెంగాల్ లోని నాలుగు జిల్లాలకు రైల్వే సేవలు నిలిచిపోయాయి.