జీవితకాల గరిష్టానికి బంగారం ధర.. అదే బాటలో వెండి.. కారణాలివేనా..!
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2200 డాలర్లు తాకింది. వడ్డీరేట్లు తగ్గిస్తామన్న యూఎస్ ఫెడ్ రిజర్వు సంకేతాలతో డాలర్ డిమాండ్ తగ్గింది.
ఈ ఏడాది కీలక వడ్డీరేట్లలో కనీసం మూడుసార్లు తగ్గింపు ఉంటుందని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటనతో అంతర్జాతీయ, జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు మెరుస్తున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో (ఎంసీఎక్స్) పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర గురువారం ఒక్కరోజే రూ.1028 పెరిగింది. తులం బంగారం ధర సుమారు 1.5 శాతం వృద్ధితో రూ.66,778లకు చేరుకుని జీవిత కాల గరిష్ట రికార్డును నమోదు చేసింది. మరోవైపు, కిలో వెండి ధర ఎంసీఎక్స్‌లో రూ.1,152 (1.53 శాతం) పెరిగి రూ.76,465లకు చేరుకున్నది.
అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 2200 డాలర్లు తాకింది. వడ్డీరేట్లు తగ్గిస్తామన్న యూఎస్ ఫెడ్ రిజర్వు సంకేతాలతో డాలర్ డిమాండ్ తగ్గింది. టాప్ సిక్స్ కరెన్సీల్లో డాలర్ ఇండెక్స్ విలువ 103.22 శాతం పతనమైంది. ఆందోళనకర స్థాయిలో ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, మూడు దఫాలు వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో ఔన్స్ బంగారం ధర 2200 డాలర్లు పలకడం ఇదే తొలిసారి అని హెచ్డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా తెలిపారు.
అంతర్జాతీయ అనిశ్చితుల పరిస్థితుల్లో వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు, ప్రత్యేకించి చైనా సెంట్రల్ బ్యాంకు బంగారం కొనుగోళ్లు పెంచడంతో పసిడి ధర పెరుగుదలకు కారణమని హెచ్డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనూజ్ గుప్తా చెప్పారు. 2020 తర్వాత వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేశాయి. రెండేండ్లుగా 1000 టన్నులకు పైగా కేంద్రీయ బ్యాంకులు బంగారం కొని రిజర్వ్ చేశాయి. ఇదే ధోరణి ఈ ఏడాదిలోనూ కొనసాగుతుందని బులియన్ విశ్లేషకులు అంచనా వేశారు.
హైదరాబాద్‌లో తులం బంగారం (24 క్యారట్స్) రూ.1090 పెరిగి రూ.67,420 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.67,570, ముంబైలో రూ.67,420 పలికింది. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం ధర హైదరాబాద్, ముంబైల్లో 61,800, ఢిల్లీలో 61,950 వద్ద నిలిచింది. ఎంసీఎక్స్‌లో మే వెండి కిలో ధర రూ.74,300 నుంచి రూ.77,300 మధ్య తచ్చాడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.