Telugu Global
National

అర గంట టైమ్ ఇస్తే అద్భుతమైన బడ్జెట్ తెస్తా : బెంగాల్ సీఎం మమత బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బడ్జెట్‌పై తీవ్రంగా విరుచుక పడ్డారు. కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించినట్లు స్పష్టమవుతుందన్నారు.

అర గంట టైమ్ ఇస్తే అద్భుతమైన బడ్జెట్ తెస్తా : బెంగాల్ సీఎం మమత బెనర్జీ
X

భారత పార్లమెంటులో ఇవాళ 2023-24కు సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. రికార్డు స్థాయిలో ఆమె 6వ సారి వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. ఈ సారి బడ్జెట్ అద్బుతంగా ఉందని ఎన్టీయే పక్షాలు అంటుండగా.. ఇదొక పనికి మాలిన బడ్జెట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భగ్గుమంటున్నాయి. ఇదొక జుమ్లా బడ్జెట్ అని మండిపడుతున్నాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బడ్జెట్‌పై తీవ్రంగా విరుచుక పడ్డారు. కేవలం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ రూపొందించినట్లు స్పష్టమవుతుందన్నారు. తనకు ఒక అరగంట టైమ్ ఇస్తే అద్భుతమైన బడ్జెట్‌ను ప్రజల ముందుకు తెస్తానని చెప్పారు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ వల్ల పేదలకు ఒరిగేది ఏమీ లేదని విమర్శించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ స్లాబుల్లో మార్పులు చేయడం వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా బడ్జెట్‌పై పెదవి విరిచింది. ఎవరికీ పనికి రాని బడ్జెట్ ఇదని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. రాబోయే రెండు మూడు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన బడ్జెట్ అని ఆయన ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు ఏవీ బడ్జెట్‌లో ప్రకటించకోవడం శోయనీయం అన్నారు. పేదలకు సంబంధించిన అంశాలు, ఉద్యోగ కల్పనకు సంబంధించిన ప్రకటనలు లేకుండానే బడ్జెట్‌ను ప్రకటించడం బాధకరమని ఖర్గే అన్నారు.

గత బడ్జెట్‌లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్యా రంగాలకు కాస్త మెరుగైన కేటాయింపులు చేసినట్లు అనిపించాయి. కానీ ఈ సారి మాత్రం అసలు రూపం చూపించారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఆయా రంగాలకు గతంలో కంటే చాలా తక్కువగా కేటాయింపులు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ కూడా బడ్జెట్‌పై అసహనం వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపలేదని ఆయన చెప్పారు.

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత తొమ్మిదేళ్లుగా ఇదే రకమైన బడ్జెట్ ప్రవేవపెడుతున్నారని విమర్శించారు. పన్నులు పెంచారని, సంక్షేమం కోసం నిదులు తక్కువగా కేటాయించారని అన్నారు. బడా బిజినెస్‌మ్యాన్‌ల కోసమే ట్యాక్సుల వసూలు చేస్తున్నారు. ఆ పన్నులతో ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారని అన్నారు. ఇలాంటి బడ్జెట్‌ల కారణంగా ఎగువన ఉన్న వాళ్లు కూడా దిగువకు పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

First Published:  1 Feb 2023 6:16 PM IST
Next Story