Telugu Global
National

గులాం నబీ ఆజాద్ సొంత‌ పార్టీ పేరు, జెండా ఇదే

జమ్ము కశ్మీర్ లో నూతన పార్టీ పురుడు పోసుకుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ తన కొత్త పార్టీని ప్రకటించారు. పార్టీ పేరును 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అని వెల్ల‌డించారు.

గులాం నబీ ఆజాద్ సొంత‌ పార్టీ పేరు, జెండా ఇదే
X

కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారంనాడు జమ్మూలో కొత్త రాజకీయ పార్టీని ప్ర‌క‌టించారు. పార్టీ పేరును 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' అని వెల్ల‌డించారు. నీలం , తెలుపు, పసుపు రంగుల‌తో కూడిన పార్టీ జెండాను కూడా ప్ర‌ద‌ర్శించారు. ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయని, ఈ శుభ సందర్భంగా పార్టీని ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు.

మూడు రంగులు నిలువుగా ఉన్న ఆ జెండాలో మొదటి రంగు నీలం. మధ్యలో తెలుపు రంగు. మూడో రంగు పసుపు . పసుపు రంగు సృజనాత్మకత, కొత్త ఆలోచనల‌కు సూచిక‌ల‌ని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని.. తెలుపు శాంతికి చిహ్నమని, నీలం స్వేచ్ఛకు.. సముద్రంలోని లోతుకు.. అందనంత ఎత్తులో ఉండే ఆకాశ వర్ణానికి చిహ్నమని ఆజాద్ వివ‌రించారు. "మేము గాంధీజీని విశ్వసిస్తాము, అందువల్ల శాంతి మా ప్రాధాన్యత. ఆదర్శం" అని ఆయన అన్నారు. " జ‌మ్ము క‌శ్మీర్ కూడా భార‌త దేశం మాదిరిగా వివిధ మ‌తాలు, భౌగోళిక‌, సంస్కృతుల స‌మ్మేళ‌నంగా ఉంటుంద‌ని" అని ఆయన అన్నారు.

పార్టీ పేరులోని ఆజాద్ స్వేచ్ఛ, స్వతంత్ర ఆలోచనకు నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. మా పార్టీ సభ్యులు స్ఫూర్తిదాయకంగా ఉండి, ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి రావాలి తప్ప డబ్బు సంపాదించడం కోసం కాదు. అని చెప్పారు.

ఆర్టికల్ 370 పునరుద్ధరణ అసాధ్యమని తాను చేసిన ప్రకటనపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నించ‌గా , ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసే వారికి పార్లమెంటులో సంఖ్యాబలం ఉంటేనే దాన్ని పునరుద్ధరించగలమని చెప్పాన‌ని అన్నారు. "ఇది చేయలేమని నేను చెప్పడం లేదు, కానీ దాని కోసం సంఖ్యాబ‌లం కావాలి లేదా దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేసే వారు ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించగలగాలి," అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఐదు ద‌శాబ్దాల అనుబంధాన్ని వ‌దులు కొని ఆజాద్ నెల రోజు క్రితం పార్టీకి రాజీనామా చేసిన‌ప విష‌యం తెలిసిందే.

First Published:  26 Sept 2022 6:57 PM IST
Next Story