గులాంనబీ ఆజాద్ కొత్త రాజకీయ పార్టీ !?
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. రాబోయే జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన పార్టీ పోటీ చేయనుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆయన జమ్ముకశ్మీర్ లో ప్రాంతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు ఆజాద్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో తాను ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా రాష్ట్రానికే పరిమితమయ్యేలా పార్టీని ఏర్పాటు చేస్తారని ఆ తర్వాత దానిని జాతీయ స్థాయికి విస్తరించే విషయాన్ని ఆలోచిస్తారంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆజాద్ పార్టీ స్వరూపం ఎలా ఉండబోతోందనే విషయమై పూర్తి స్పష్టత లేదు. రానున్న రోజుల్లో అంటే జమ్ముకశ్మీర్ ఎన్నికలకు ముందు దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కొత్త పార్టీ మైనారిటీ, బడుగు బలహీన, అణగారిన వర్గాల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఉంటుందని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రిగా కూడా పని చేసిన ఆజాద్ ఈ సారి ఎన్నికల్లో సొంత పార్టీపై ఒంటరిగా పోటీ చేస్తారా లేదా ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు ఏర్పర్చుకుంటారా అనే విషయాలపై అప్పుడే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఆయన బిజెపితో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే సందర్భంలో ఆజాద్ చర్యలు బిజెపికి లాభిస్తాయనే వాదన వినబడుతోంది.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ముందు తన సొంత ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ యేడాది చివరిలో జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్రం ఆ ఏర్పాట్లలో ఉంది. తాను బిజెపిలో చేరబోతున్నానన్న వార్తలను ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను కాషాయ పార్టీలోచేరేది లేదని ఆజాద్ స్పష్టం చేశారు.
కాగా, ఆజాద్ కు మద్దతుగా జిఎం సరూరి, హాజీ అబ్దుల్ రషీద్, మొహమ్మద్ అమీన్ భట్, గుల్జార్ అహ్మద్ వానీ, చౌదరి మొహమ్మద్ అక్రమ్ శుక్రవారంనాడు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ లో నెలకొన్న పరిణామాల పట్ల ఆజాద్ సహా పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి గా ఉన్నారు. వీరంతా జి-23 నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ వారంతా అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఆ తర్వాత ఆయనకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించలేదు.ఆజాద్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ ఆయనపై ప్రశంశలు కురిపించారు. సీనియర్ పార్లమెంటేరియన్ అంటూ పొగుడుతూ తనకు ఎన్నో విషయాల్లో ఆజాద్ మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని మంచి స్నేహితుడంటూ కొనియాడారు. అలాగే జమ్ములో జరిగిన ఒక కార్యక్రమంలో.. ఉన్నత పదవిని పొందినా మోడీ ఎంతో ఒదిగి ఉండే వ్యక్తి అంటూ ఆజాద్ ఆయన్ను పొగిడినప్పుడు కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలతో ఆజాద్ బిజెపిలో చేరనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అలాగే ఆయనకు రాష్ట్రపతి కానీ ఉప రాష్ట్రపతిగా కానీ బిజెపి అవకాశం కల్పిస్తుందనే వార్తలు కూడా బలంగా వినిపించాయి. అయితే అవి కేవలం ఊహాగానాలని ఆ తర్వాత తేలింది.