Telugu Global
National

రెండు వారాల్లో ఆజాద్ పార్టీ.. కాశ్మీర్ పైనే ఫోకస్..

గులాంనబీ ఆజాద్ అధ్యక్షతన సెప్టెంబర్ 4న కాశ్మీర్ లో కీలక సమావేశం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ వ్యవహారాలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు సరూరీ. అభివృద్ధి, అన్ని వర్గాల ఐక్యత కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు.

రెండు వారాల్లో ఆజాద్ పార్టీ.. కాశ్మీర్ పైనే ఫోకస్..
X

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చిన గులాంనబీ ఆజాద్ రెండు వారాల్లో కొత్త పార్టీ ప్రకటించే అవకాశముంది. ఆజాద్ సన్నిహితుడు జీఎం సరూరీ ఆజాద్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ముందుగా తమ పార్టీ జమ్మూ కాశ్మీర్ పైనే ఫోకస్ చేస్తుందని చెప్పారు సరూరీ. రాబోయే కాశ్మీర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. 2019 ఆగస్ట్ 5కి ముందున్న పరిస్థితుల్ని తిరిగి పునరుద్ధరించేందుకు తాము ప్రయత్నిస్తామన్నారు. అదే తమ అజెండా అని, కాశ్మీర్ ఎన్నికల మేనిఫెస్టోలో అదే కీలకాంశమని చెప్పారాయన.

సెప్టెంబర్ 4న కీలక మీటింగ్..

గులాంనబీ ఆజాద్ అధ్యక్షతన సెప్టెంబర్ 4న కాశ్మీర్ లో కీలక సమావేశం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశంలోనే పార్టీ వ్యవహారాలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని అన్నారు సరూరీ. అభివృద్ధి, అన్ని వర్గాల ఐక్యత కోసం తమ పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ముందు రాష్ట్ర స్థాయి పార్టీ ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ గురించి ఆలోచిస్తామన్నారు. సరూరీతో సహా చాలామంది కాశ్మీరీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. వారంతా ఆజాద్ తో జరిగే మీటింగ్ కి హాజరవుతారు. సెప్టెంబర్-4 నాటికి మరికొంతమంది నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కాంగ్రస్ ని వీడి తమతో కలుస్తారని చెబుతున్నారు.

బీజేపీతో వైఖరి ఏంటి..?

ఆజాద్ రాజీనామా తర్వాత చాలామంది ఆయన బీజేపీలో చేరతారనే అంచనాకి వచ్చారు. కానీ తమ నాయకుడు లౌకిక వాది అని, బీజేపీతో కలసి వెళ్లడం కష్టమని చెబుతున్నారు సరూరీ. బీజేపీలో కలిస్తే ఇప్పటికిప్పుడే పదవి వచ్చే అవకాశమున్నా కూడా కాశ్మీర్ ప్రజల కోసమే ఆజాద్ పార్టీ పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ మునిగిపోతున్న నావ కావడంతో.. తామంతా పార్టీనుంచి బయటకొచ్చేశామని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీనుంచి మరింతమంది బయటకొస్తారని, అయితే వారు ఏయే పార్టీల్లో చేరతారనేది వారి వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు.

First Published:  28 Aug 2022 9:01 AM IST
Next Story