Telugu Global
National

మూడు నెలల్లో ఫిట్ గా మారకపోతే ఇంటికే.. పోలీసులకు అస్సోం సర్కార్ ఆఖరి ఛాన్స్

మద్యానికి బానిసైన పోలీసులు, పొట్ట పెంచి బరువెక్కిన పోలీసులు మూడు నెలల్లోగా ఫిట్ గా మారాలని.. లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని అస్సోం సర్కార్ హెచ్చరించింది.

Get fit in 3 months or get Voluntary Retire, Assam Police warns cops
X

మూడు నెలల్లో ఫిట్ గా మారకపోతే ఇంటికే.. పోలీసులకు అస్సోం సర్కార్ ఆఖరి ఛాన్స్

మద్యానికి బానిసైన పోలీసులు, పొట్ట పెంచి బరువెక్కిన పోలీసులు మూడు నెలల్లోగా ఫిట్ గా మారాలని.. లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి ఉంటుందని అస్సోం సర్కార్ హెచ్చరించింది. పోలీసు శాఖలో స్థూలకాయులు, మద్యానికి బానిసైన వారిని గుర్తించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అటువంటి వారి జాబితాను సిద్ధం చేశారు. అధిక బరువు, మద్యానికి బానిసైన 680 మందిని గుర్తించారు.

వీరితో స్వచ్ఛంద పదవీ విరమణ చేయించాలని అస్సోం సర్కార్ తొలుత భావించింది. అయితే ఇప్పుడు అటువంటి వారికి మరో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించింది. అధికంగా బరువు ఉన్నవారు మద్యానికి బానిస అయిన పోలీసులు మూడు నెలల్లోగా ఫిట్ గా మారాలని, లేకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ ఆప్షన్ ఇస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయమై అస్సోం డీజీపీ జీపీ సింగ్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.



'ఫిట్ గా లేని పోలీసులకు ఆగస్టు 15 వరకు మూడు నెలల సమయం ఇస్తాం. ఆ తర్వాత బీఎంఐ లెక్కింపు చేపడతాం. అప్పటికీ ఫిట్ గా మారకపోతే స్వచ్ఛంద పదవీ విరమణ చేయిస్తాం. ఊబకాయం( బీఎంఐ 30+) కేటగిరిలో ఉన్నవారు బరువు తగ్గేందుకు మరో మూడు నెలల సమయం కూడా ఇస్తాం. అప్పటికి కూడా వారు ఫిట్ మారకపోతే థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని మినహాయించి మిగతా వారితో స్వచ్ఛంద పదవీ విరమణ చేయిస్తాం.

ఆగస్టు 16వ తేదీన పోలీసులు ఫిట్ ఉన్నారో లేదో అని తెలుసుకునేందుకు పరిశీలన జరుపుతాం. ఈ కార్యక్రమానికి స్వయంగా నేనే హాజరవుతాను' అని డీజీపీ ట్వీట్ చేశారు. ఫిట్ నెస్ పెంచుకునేందుకు పోలీస్ శాఖ మూడు నెలల సమయం మాత్రమే ఇవ్వడంతో ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో అని బాగా పొట్ట పెంచుకున్న పోలీసులు ఇప్పుడు సన్నబడేందు కోసం జిమ్ లు, మైదానాల వెంట పడుతున్నారు.

First Published:  17 May 2023 2:39 AM IST
Next Story