Telugu Global
National

'జనరిక్' కి తాత్కాలిక బ్రేక్

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), ఇండియా ఫార్మాసుటికల్ అలయన్స్ అసోసియేషన్ (IPA).. అభ్యంతరాలు తెలపడంతో NMC వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి.

జనరిక్ కి తాత్కాలిక బ్రేక్
X

"ఇకపై డాక్టర్లంతా చీటీలో జనరిక్ మందుల పేర్లే రాయాలి, కమీషన్లు తీసుకుని బ్రాండ్ లకు ప్రచారం చేయకూడదు. ఫార్మా కంపెనీలు స్పాన్సర్ చేసే సదస్సులకు హాజరు కాకూడదు. ఈ ఆదేశాలు పాటించనివారిపై జరిమానాలు విధిస్తాం, అవసరమైతే లైసెన్స్ లు రద్దు చేస్తాం." అంటూ ఈనెల 2న నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కఠిన ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కఠిన ఆదేశాల అమలు వాయిదా పడింది. వాటిని నిలిపివేస్తున్నామంటూ NMC తాజాగా ఉత్తర్వులిచ్చింది. అంటే డాక్టర్లు ఎప్పటిలాగే తమకు నచ్చిన బ్రాండ్లు రాసుకోవచ్చు. వాటిని మాత్రమే వాడాలని రోగులకు సిఫారసు చేయొచ్చు.

జనరిక్ ఎందుకు..?

భారత్ లో ఔషధాల ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో జనరిక్ మందుల గురించి విస్తృత చర్చ జరుగుతోంది. అయితే జనరిక్ పై ఇప్పటికీ కొన్ని అపోహలున్నాయి. కాస్ట్ లీ మందులే రోగాల్ని త్వరగా నయం చేస్తాయనే వాదనను కొన్ని ఫార్మా కంపెనీలు తెరపైకి తెచ్చాయి. ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి రోగులు, వారి బంధువులు ఛాన్స్ తీసుకోలేరు. ఒకవేళ డాక్టరే జనరక్ మందులు రాస్తే అప్పుడు కచ్చితంగా రోగులకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని కలిగించాలనే NMC కొత్త నిబంధనలు రూపొందించింది. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), ఇండియా ఫార్మాసుటికల్ అలయన్స్ అసోసియేషన్ (IPA).. అభ్యంతరాలు తెలపడంతో NMC వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి.

అభ్యంతరాలేంటి..?

కొన్నిరకాల కాంబినేషన్లు జనరిక్ లో దొరకవు, కొంతమంది రోగులకు ఆ కాంబినేషన్లు మాత్రమే ఫలితాలనిస్తాయి. అందుకే తాము ఆ కాంబినేషన్లు(బ్రాండ్లు) రాస్తున్నామని అంటున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు. ఇప్పుడు జనరిక్ పేరుతో తమ చేతులు కట్టేస్తే అది మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. అందులోనూ ఇలాంటి కఠిన నిబంధనలు చేసే అధికారం NMC కి లేదని వారు తేల్చి చెప్పారు. ఒకవేళ అలాంటి ఆదేశాలివ్వాలంటే పార్లమెంట్ లో చట్టం చేయాలని కోరారు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలతో జరిగిన చర్చల్లో తమ అభిప్రాయాలను చెప్పారు IMA, IPA నేతలు. దీంతో జనరిక్ కి బ్రేక్ పడింది.


First Published:  25 Aug 2023 7:32 AM IST
Next Story