తప్పంతా ఆ ముగ్గురిదే.. గెహ్లాత్ సేఫ్..
పార్టీ చీఫ్ విప్ మహేష్ జోషి, ధర్మేంద్ర పాథక్, ఎమ్మెల్యేలను తన ఇంట్లో సమావేశపరచిన మంత్రి శాంతి ధరివాల్ ఈ సంక్షోభానికి కారణం అని తేల్చారు. ఆ ముగ్గురిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
గెహ్లాత్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతుందని అందరూ అంచనా వేస్తున్న సమయంలో, రాజస్థాన్ సంక్షోభానికి ఆయన కారణం కాదంటూ సోనియా గాంధీకి నివేదిక అందింది. గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ ఈ మేరకు రాజస్థాన్ కాంగ్రెస్ సంక్షోభంపై పూర్తి నివేదికను రూపొందించి ఇచ్చారు. ఇందులో గెహ్లాత్ తప్పేమీ లేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో ముగ్గురు కీలక నేతలపై క్రమశిక్షణ వేటు వేయాలని అజయ్ మాకెన్ సిఫారసు చేశారు. పార్టీ చీఫ్ విప్ మహేష్ జోషి, ధర్మేంద్ర పాథక్, ఎమ్మెల్యేలను తన ఇంట్లో సమావేశపరచిన మంత్రి శాంతి ధరివాల్ ఈ సంక్షోభానికి కారణం అని తేల్చారు. ఆ ముగ్గురిపై అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
గెహ్లాత్‌కి క్లీన్ చిట్..!
ఏఐసీసీ అధ్యక్ష స్థానానికి పోటీ చేయాలనుకుంటున్న గెహ్లాత్, రాజస్థాన్ సీఎంగా కూడా కొనసాగాలనుకున్నా.. రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌తో వెనక్కి తగ్గారు. రాజస్థాన్ సీఎం పోస్ట్‌ని త్యాగం చేయాలనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి పీఠంపై సీపీ జోషిని కూర్చోబెట్టాలని ఆయన సిఫారసు చేశారు. కానీ అధిష్టానం గతంలో త్యాగం చేసి తన విధేయత నిరూపించుకున్న సచిన్ పైలట్ వైపు మొగ్గు చూపింది. ఈ దశలో రాజస్థాన్ సీఎల్పీ సమావేశం గందరగోళంగా మారింది. తదుపరి సీఎంను ఎంపిక చేయాల్సిన ఎమ్మెల్యేల బృందం నిట్ట నిలువునా చీలింది. 82 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశానికి హాజరు కాలేదు, మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ దశలో వీరి వెనక ఉండి స్టోరీ నడిపించింది గెహ్లాత్ అనే అనుమానాలు బలపడ్డాయి. చివరకు అజయ్ మాకెన్ రాజస్థాన్ వ్యవహారాలపై ఓ రిపోర్ట్ రెడీ చేశారు.
వాస్తవానికి గెహ్లాత్‌కి, ఈ తిరుగుబాటుకి సంబంధం లేదు. అప్పట్లో సచిన్ పైలట్ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు గెహ్లాత్‌కి మద్దతుగా ఉండి పార్టీ పటిష్టతకు కృషి చేసినవారు ఇప్పుడు అడ్డం తిరిగారు. మంత్రి శాంతి ధరివాల్, పార్టీ చీఫ్ విప్ మహేష్ జోషి, ధర్మేంద్ర పాథక్ ఈ ముగ్గురూ ఓ జట్టుగా ఏర్పడ్డారు. తమతోపాటు 79 మంది ఇతర ఎమ్మెల్యేలను కూడా పోగు చేశారు. సచిన్ పైలట్‌కి సీఎం సీటు ఇవ్వకూడదని పట్టుబట్టారు. తమలో ఒకరికి అధిష్టానం న్యాయం చేయాలన్నారు.
ఓ దశలో గెహ్లాత్ వల్లే ఈ సంక్షోభం వచ్చిందని అధిష్టానం భావించింది. ఆయన్ను ఏఐసీసీ అధ్యక్ష రేసు నుంచి తప్పించాలని కూడా అనుకుంది. కానీ అజయ్ మాకెన్ రిపోర్ట్ తో గెహ్లాత్ ఏఐసీసీ అధ్యక్ష పదవి దక్కించుకోవడం ఖాయమని తెలుస్తోంది. అదే సమయంలో రాజస్థాన్ సంక్షోభానికి కారణం అయిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని, మిగతావారిని ఏకం చేసి సచిన్ పైలట్‌కి సీఎంగా అవకాశమిచ్చే ప్రయత్నాలు జరుగుతాయంటున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే, గెహ్లాత్ జాతీయ రాజకీయాలకు వెళ్తారు, రాష్ట్రంలో సచిన్ పైలట్ హవా మొదలవుతుంది.