మేం పెళ్లి చేసుకుంటాం.. అనుమతించండి ప్లీజ్..!
ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా. ఆ యువకులిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహానికి అనుమతి ఇవ్వాలంటూ ఇప్పుడు వీరిద్దరూ భారత అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
ఆ జంట పెళ్లి చేసుకుంటామంటున్నారు. తమకు అనుమతి ఇవ్వండి ప్లీజ్ అంటూ అభ్యర్థిస్తున్నారు. ఏకంగా సుప్రీం కోర్టుకే అర్జీ పెట్టుకున్నారు. పెళ్లికి అనుమతి కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సిన అవసరమేముంది అనుకుంటున్నారా.. మామూలు జంట అయితే అక్కర్లేదు.. కానీ ఈ జంట మాత్రం వెళ్లాల్సిందే. ఇక అనుమతి వస్తుందా.. రాదా..? అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది.
అసలు విషయం ఏమిటంటే..
వాళ్లిద్దరూ స్వలింగ సంపర్క జంట. వారి పేర్లు ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా. ఆ యువకులిద్దరూ ప్రస్తుతం విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. స్వలింగ సంపర్క వివాహానికి అనుమతి ఇవ్వాలంటూ ఇప్పుడు వీరిద్దరూ భారత అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తాము పదిహేనేళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని, తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరారు.
వీరితో పాటు మరో ముగ్గురు కూడా తమ పెళ్లిళ్లకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనలన్నింటిపై మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఇప్పుడు ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే తైవాన్ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్ నిలవనుంది.