రాజకీయాలకు గంభీర్ గుడ్‌బై.. తానూ పోటీచేయట్లేదన్న యువరాజ్
ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలే అక్కర్లేదు. `యు వీ కెన్` అనే నా స్వచ్ఛంద సంస్థ ద్వారా నా వంతుగా ప్రజలకు సేవ చేస్తున్నాను అని క్లారిటీ ఇచ్చేశారు.
రాజకీయ భవితవ్యంపై ఇద్దరు టీమిండియా మాజీ స్టార్లు క్లారిటీ ఇచ్చారు. తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మరో మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తాను రాజకీయాల్లోకి రావట్లేదని తేల్చిచెప్పేశారు.
విముక్తి కల్పించాలని గంభీర్ ట్వీట్
`రాజకీయ విధుల నుంచి నాకు విముక్తి కల్పించాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాను. క్రికెట్‌పై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్లూ ప్రజాసేవ చేసేందుకు అవకాశమిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను` అని గంభీర్ నిన్న ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఐపీఎల్‌లో రెండేళ్లు లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటార్‌గా ఉన్న గౌతీ ఇప్పుడు తన పాత జట్టు కేకేఆర్‌కు తిరిగి వెళ్లబోతున్నారు.
ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలే అక్కర్లేదన్న యువీ
మరో మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఈసారి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. పంజాబ్‌లోని గురుదాసపూర్‌లో ఆయన పోటీ చేస్తారని, ఆ మేరకు బీజేపీ కీలక నేత నితిన్ గడ్కరీని కలిశారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాన్ని ఈరోజు యువీ ట్విట్టర్ వేదికగా తోసిపుచ్చారు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలే అక్కర్లేదు. `యు వీ కెన్` అనే నా స్వచ్ఛంద సంస్థ ద్వారా నా వంతుగా ప్రజలకు సేవ చేస్తున్నాను అని క్లారిటీ ఇచ్చేశారు.