Telugu Global
National

మహా మహా పెట్టుబడిదారులు హాజరైన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు గౌతమ్ అదానీ ఎందుకు రాలేదు ?

ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, కుమార మంగళం వంటి మహా మహులు పాల్గొన్న మొదటి రోజు సదస్సుకు అదాని రాకపోవడం ఆ సదస్సులో చర్చనీయాంశమైంది.

మహా మహా పెట్టుబడిదారులు హాజరైన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు గౌతమ్ అదానీ ఎందుకు రాలేదు ?
X

హిండెన్ బర్గ్ నివేదికల తో అదానీ గ్రూపు ఆస్తులు హారతి కర్పూరంలో కరిగిపోయి, ఆ సంస్థ సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అదాని హాజరుకాలేదు. ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లా సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలనేక మంది మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సును యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఈ రోజు ప్రారంభమయ్యింది.

వార్తా నివేదికల ప్రకారం, ఈ కార్యక్రమంలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు యూపీకి మౌలిక సదుపాయాలు, వ్యాపార అభివృద్ధికి బిలియన్ల డాలర్లను పెడతామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పరిశ్రమల శాఖ మంత్రి నంద్ గోపాల్ గుప్తా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, అదానీ గ్రూప్ సుమారు రూ. 60,000-70,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి హామీ ఇచ్చిందని, అయితే ఈ సమావేశంలో ఆ కంపెనీకి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనేది తెలియాల్సి ఉందని అన్నారు.

అదానీ సదస్సు రెండవ, లేక మూడవ రోజు వస్తారా లేదా తెలియదు. కానీ ప్రధాని మోడీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముఖేష్ అంబానీ, కుమార మంగళం వంటి మహా మహులు పాల్గొన్న మొదటి రోజు సదస్సుకు అదాని రాకపోవడం ఆ సదస్సులో చర్చనీయాంశమైంది.

కాగా అదానీ గ్రూపుకు ఇచ్చిన విధ్యుత్ స్మార్ట్ మీటర్ల తయారీ ఆర్దర్ ను యూపీ ప్రభుత్వం అదానీ స్కాం బైటపడ్డాక రద్దు చేయడం, మళ్ళీ టెండర్లు పిలుస్తామని ప్రకటించడం తదితర చర్యలతో యోగీకి అదానీకి మధ్య పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో యోగి ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల సదస్సుకు అదాని రాకపోవడం మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది.

అదానీకి స్మార్ట్ మీటర్ల ఆర్డర్ ను రద్దు చేయడం మోడీకి యోగీకి మధ్య కోల్డ్ వార్ కు కారణమయ్యిందన్న వార్తలు వచ్చాయి. యూపీ డిజీపీగా యోగీ ప్రతిపాదించిన పేరును మోడీ సర్కార్ తిరస్కరించడం, అయినప్పటికీ యోగి ఆయననే నియమించడం. మోడికి అత్యంత ఇష్టుడైన బీజేపీ ఎంపీ, రెజ్లర్ అసోసియేషన్ అధ్యక్షుడైన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మీద రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడ‌ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన మేనల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే అయిన సుమిత్ సింగ్, అతని అనుచరులపై యోగి ప్రభుత్వం కేసులు పెట్టడం... తదితర సంఘటనలతో మోడీ, యోగి మధ్య కూడా సయోధ్యలేదనే చర్చసాగుతోంది.

First Published:  10 Feb 2023 8:37 PM IST
Next Story