Telugu Global
National

యూపీలో దారుణం: పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులను కాల్చి చంపిన దుండగులు

అతిక్ అహ్మద్, అతని సోదరుడు విలేఖరులతో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు దుండగుడు అతిక్ అహ్మద్ తలపై కాల్చాడు. మరుసటి క్షణం అతని సోదరుడిపై కూడా కాల్పులు జరిపారు. వీరిద్దరిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారిపై దుండగులు కాల్పులు జరుపుతున్నప్పుడు వారికి సంకెళ్ళు వేసి ఉన్నాయి. చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు.

యూపీలో దారుణం: పోలీసు కస్టడీలో ఉన్న ఇద్దరు నిందితులను కాల్చి చంపిన దుండగులు
X


ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ లను ఈ రోజు జైలు నుండి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వైద్య పరీక్షల కోసం తీసుకువెళుతుండగా కొందరు దుండగులు శనివారం రాత్రి కాల్చి చంపారు. మొత్తం ముగ్గురు దుండగులు వారి దగ్గరికి చేరుకొని ఒక వ్యక్తి ముందుగా అతిక్ అహ్మద్ తలపై తుపాకీ పెట్టి అతి దగ్గరి నుంచి కాల్చేశాడు. ఆ తర్వాత మరో దుండగుడు అష్రఫ్ అహ్మద్ పై కాల్పులు జరపగా అతను కిందపడిపోయాడు. ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు.

రెండు రోజుల క్రితం యూపీలోని ఝాన్సీలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ కూడా చనిపోయాడు.

హత్యకు గురైన అతిక్ అహ్మద్ న్యాయవాది విజయ్ మిశ్రా ఎన్‌డిటివితో మాట్లాడుతూ, అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు సమీపం నుండి కాల్పులు జరిపారు. వారిని కాల్చి చంపినప్పుడు తాను వారి పక్కనే నిలబడి ఉన్నానని చెప్పారు.

ఆ ఇద్దరిని కాల్చి చ‍ంపిన‌ ముగ్గురు దుండగులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముష్కరులు విలేకరుల వేషంలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అతిక్ అహ్మద్, అతని సోదరుడు విలేఖరులతో మాట్లాడుతూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు దుండగుడు అతిక్ అహ్మద్ తలపై కాల్చాడు. మరుసటి క్షణం అతని సోదరుడిపై కూడా కాల్పులు జరిపారు. వీరిద్దరిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వారిపై దుండగులు కాల్పులు జరుపుతున్నప్పుడు వారికి సంకెళ్ళు వేసి ఉన్నాయి. చుట్టూ పోలీసులు కూడా ఉన్నారు.

ఈ సంఘటన‌లో ఒక కానిస్టేబుల్‌, జర్నలిస్టు కూడా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

కాల్పుల ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. అధికారులు ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద సమావేశాలు నిషేధించారు.

అతిక్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ కిడ్నాప్ కేసులో దోషిగా ఉన్నారు. 2005లో బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య, ఈ ఏడాది ఫిబ్రవరిలో హత్యకు గురైన లాయర్‌ ఉమేష్‌ పాల్‌ హత్య కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు.

మంగళవారం అహ్మదాబాద్‌లోని జైలు నుంచి అతిక్ అహ్మద్‌ను యూపీకి తీసుకొచ్చారు. తాను ఎన్‌కౌంటర్‌లో చనిపోతానని కొంతకాలంగా ఆరోపిస్తున్న అతిక్ అహ్మద్ కనీసం తన కుటుంబాన్నైనా రక్షించాలని అధికారులను అభ్యర్థించాడు.

ఈ హత్య‌లను ఖండించిన ప్రతిపక్షాలు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చట్టబద్ధమైన పాలనను అందించడంలో విఫలమైందని ఆరోపించాయి.

"అతిక్, అతని సోదరుడిని పోలీసు కస్టడీలో ఉండగా వారి చేతులకు సంకెళ్ళు వేసి ఉండగా చంపేశారు.. వారి హత్య రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి సరైన ఉదాహరణ. ఎన్‌కౌంటర్-రాజ్‌ని నడిపించేవారే ఈ హత్యకు బాధ్యత వహించాలి." అని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ చేశారు.

యూపీలో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయని, నేరస్థులకు మద్దతు అధికమైందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘పోలీసుల భద్రత మధ్య ఉన్న వ్యక్తులనే ఇలా బ‌హిరంగంగా కాల్చి చంపితే ఇక సామాన్యుల భద్రత ఏంటి? దీని వల్ల ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొని ఉంది.. కొందరు కావాలనే ఇలాంటి వాతావరణం సృష్టిస్తున్నారు. ’’ అని అఖిలేష్ ట్వీట్ చేశారు.

అయితే యూపీ మంత్రి స్వతంత్ర దేవ్ సింగ్ మాత్రం ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. - "పాపం , పుణ్యం ఈ జన్మలోనే లెక్కించబడుతుంది..." అని ఆయన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.



First Published:  16 April 2023 1:50 AM IST
Next Story