Telugu Global
National

గంగా విలాస్ బురదలో చిక్కుకుపోయిందా..? ప్రభుత్వానికి అంత ఉలుకెందుకు..?

బీహార్ లో గంగా విలాస్ బురదలో చిక్కుకుపోయిందనే వార్తలు బయటకు రాగానే వెంటనే కేంద్రం నష్టనివారణ చర్యలకు దిగింది. ఇలాంటి ప్రచారంతో అసలుకే మోసం వస్తుందనుకున్న మంత్రులు, అధికారుల్ని రంగంలోకి దింపారు.

గంగా విలాస్ బురదలో చిక్కుకుపోయిందా..? ప్రభుత్వానికి అంత ఉలుకెందుకు..?
X

ప్రధాని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గంగా విలాస్ ప్రయాణంలో రెండు రోజులకే అంతరాయం ఏర్పడిందని ఆ భారీ నౌక బురదలో చిక్కుకుపోవడంతో ప్రయాణికుల్ని టగ్ బోట్లలో ఒడ్డుకు చేర్చారని, ఆ తర్వాత తిరిగి అదే బోట్లలో నౌక వద్దకు చేర్చి ప్రయాణం కొనసాగించారనే వార్తలు వినపడ్డాయి.

అసలేం జరిగింది..?

బీహార్ లో చిరంద్ సరన్ అనే పురావస్తు ప్రదేశం కూడా గంగా విలాస్ షెడ్యూల్ లో ఉంది. అయితే చిరంద్ సరన్ కి వెళ్లే క్రమంలో నౌకను ఛప్రా సమీపంలో ఆపేశారు. అక్కడినుంచి ప్రయాణికుల్ని ఒడ్డుకు చేర్చి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరంద్ సరన్ కి తీసుకెళ్లారు. అయితే చిరంద్ సరన్ దగ్గర నౌక లంగరు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో ఇలా చేశామంటున్నారు అధికారులు. నౌకను దూరంగా ఆపేసి ప్రయాణికుల్ని రోడ్డు మార్గంలో తీసుకురావడమేంటనే ప్రశ్నలు వినపడుతున్నాయి. నౌక బురదలో చిక్కుకుపోవడం వల్లే వారిని టగ్ బోట్లలో తీసుకు వచ్చారనే కథనాలు వెలువడ్డాయి. దీనికి కూడా అధికారులు వివరణ ఇస్తున్నారు. ప్రయాణికులంతా విదేశీయులని వారి భద్రత, గోప్యత కోసం టగ్ బోట్లలో తీసుకు రావాల్సి వచ్చిందంటున్నారు అధికారులు.

అంత ఉలుకెందుకు..?

బీహార్ లో గంగా విలాస్ బురదలో చిక్కుకుపోయిందనే వార్తలు బయటకు రాగానే వెంటనే కేంద్రం నష్టనివారణ చర్యలకు దిగింది. ఇలాంటి ప్రచారంతో అసలుకే మోసం వస్తుందనుకున్న మంత్రులు, అధికారుల్ని రంగంలోకి దింపారు. గంగా విలాస్ విషయంలో అదంతా తప్పుడు ప్రచారం అని నమ్మించేందుకు ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ వార్తలను నౌకా, జల రవాణా శాఖ ఖండించింది. అనుకున్న సమయానికి నౌక పాట్నాకు చేరుకుందని, యాత్ర యధావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది. భారత అంతర్గత జలరవాణా ప్రాధికార సంస్థ (IWAI) ఛైర్మన్‌ సంజయ్‌ బందోపాధ్యాయ కూడా ఈ వార్తలను ఖండించారు. నౌక లంగరు వేయడానికి అవసరమైన నీటి మట్టం విషయంలో అనుమానాలు అవసరం లేదని ఆయన చెప్పారు.

First Published:  17 Jan 2023 8:00 AM IST
Next Story