Telugu Global
National

కిడ్నాప్ ల కోసం అంబులెన్స్ తయారు చేయించుకున్న ముఠా..

పంజాబ్ లోని పాటియాలాలో ఈ కిడ్నాప్ గ్యాంగ్ అప్పుడే పుట్టిన పిల్లల్ని కొనడం, అమ్మడం చేస్తుంటుంది. ఆస్పత్రుల వద్ద మాటువేసి బిడ్డల్ని తీసుకుని అంబులెన్స్ లో వెళ్లిపోతుంది.

కిడ్నాప్ ల కోసం అంబులెన్స్ తయారు చేయించుకున్న ముఠా..
X

పేషెంట్లను తరలించే అంబులెన్స్ అని అనుకున్నారు పోలీసులు. కానీ ఆ అంబులెన్స్ కేవలం చిన్నారులను కిడ్నాప్ చేసేందుకు తయారు చేసుకున్నారని తెలిసి అవాక్కయ్యారు. అవును, ఆ అంబులెన్స్ ని కేవలం చిన్నారుల కిడ్నాప్ కోసమే ఉపయోగిస్తుంది ఆ ముఠా. దానికోసం అంబులెన్స్ లో ప్రత్యేకంగా అరలు చేయించారు. ఆ అరల్లో పిల్లల్ని కుక్కేస్తారు, పైన పేషెంట్ పడుకునేలాగా బెడ్ ఉంటుంది. పక్కనే సెలైన్ బాటిల్, ఆక్సిజన్ సిలిండర్.. ఈ సెటప్ చూసి ఎవరికీ అనుమానం రాదు. కానీ ఆ అంబెలెన్స్ లో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నారని తెలుసుకున్న పోలీసులు నిఘా పెట్టి వారిని అరెస్ట్ చేశారు.

పంజాబ్ లోని పాటియాలాలో ఈ కిడ్నాప్ గ్యాంగ్ అప్పుడే పుట్టిన పిల్లల్ని కొనడం, అమ్మడం చేస్తుంటుంది. కొన్నిసార్లు పిల్లల్ని కిడ్నాప్ చేస్తుంటుంది ఈ గ్యాంగ్. ఆస్పత్రుల వద్ద మాటువేసి, అప్పుడే పుట్టిన బిడ్డల్ని తీసుకుని అంబులెన్స్ లో వెళ్లిపోతుంది. ఎవరికీ ఎక్కడా అనుమానం రాకుండా ఏడాదిపాటు ఈ వ్యాపారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చేశారు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలో నలుగురు సభ్యుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అంబులెన్స్ కి ముందు రెండు ఎస్కార్ట్ వాహనాలు కూడా ఉంటాయి. అంబులెన్స్ తో పాటు ఆ రెండు వాహనాలను, 4 లక్షల నగదుని పాటియాలా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ చాలాచోట్ల ఇలాంటి కిడ్నాపింగ్ ముఠాలు పట్టుబడినా, ఇలా అంబులెన్స్ ని కిడ్నాప్ కోసం వాడుకున్నవారెవరూ లేరు. వీరి ప్లానింగ్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.

First Published:  7 Dec 2022 10:29 AM IST
Next Story